
తల్లిదండ్రుల కష్టానికి తన అనారోగ్యం తోడు అవ్వకూడదని మనస్తాపంతో ఓ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అందరినీ కలిచి వేస్తుంది. కాకినాడ జిల్లా యానాం సమీపంలోని కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఉదికి సుబ్రహ్మణ్యం, స్వర్ణలత దంపతుల ఏకైక కుమారుడు వికాష్ (16). తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని, మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. డిఫెన్స్ రంగంలో చేరాలన్న లక్ష్యంతో కొత్తవలసలోని ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తుండటంతో, వారిని ఆదుకోవలన్న తపన వికాష్ మనసులో చిన్నతనం నుంచి ఉంది.
అయితే డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న వికాస్ ఇటీవల కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పి బాధ పడుతున్నాడు. కళాశాల యాజమాన్యం అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించినా, నొప్పి తగ్గలేదు. బుధవారం సాయంత్రం సెలవు ఇచ్చి ఇంటికి పంపాలని వికాష్ కోరడంతో, యాజమాన్యం అతని తల్లిదండ్రులతో మాట్లాడింది. సాయంత్రం కావడంతో రాత్రివేళ ప్రయాణం సురక్షితం కాదని, మరుసటి రోజు ఉదయం తీసుకెళ్తామని తల్లిదండ్రులు సూచించారు. దీంతో వికాష్ హాస్టల్ రూంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలా మరుసటి రోజు ఉదయం వికాష్ హాస్టల్ రూం లో ఉండగా అదే గదిలో తనతో పాటు ఉంటున్న రూమ్ మెట్స్ తరగతులకు వెళ్లిపోయారు. వారంతా క్లాస్‌లు ముగించుకుని మధ్యాహ్నం గదికి తిరిగి రావడంతో, వికాష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందిన ఘటన కనిపించింది. దీంతో వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు తోటి రూమ్ మెట్స్. వెంటనే వారు తల్లిదండ్రులను పిలిపించారు. మొదట తల్లిదండ్రులు యాజమాన్యం మీద అనుమానం వ్యక్తం చేసినా, వారి కష్టాలు, కుమారుడి బాధ, గత మూడు రోజులుగా బాధిస్తున్న తీవ్రమైన తలనొప్పి కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వికాష్.. ఉపాధ్యాయుల వేధింపులు లేవని, తనపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారని పేర్కొంటూ ఒక లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చలేకపోతున్నాననే భావోద్వేగం, అదీ కాక విపరీతమైన తలనొప్పి తన ఆత్మహత్యకు కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించాక, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శృంగవరపుకోటకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.