Weather Report: తీవ్ర వాయుగుండం.. ఏపీకి IMD తాజా హెచ్చరికలు

Weather Report: బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం దిశ మార్చుకోవడంతో ఏపీలో ఆశించిన భారీ వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలే నమోదయ్యాయి. రాష్ట్రంలో వర్షపాతం లోటు 54 శాతానికి చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Weather Report: తీవ్ర వాయుగుండం.. ఏపీకి IMD తాజా హెచ్చరికలు
Ap Weather Report

Updated on: Jul 28, 2026 | 7:19 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తరం వైపు పయనిస్తూ ఒడిశాలోని బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా మధ్య కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ మంగళవారం హల్దియా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు చేపట్టారు. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, మిగతా కోస్తా ఓడరేవుల్లో ఒకటో నంబరు హెచ్చరిక అమల్లో ఉంది. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

అలాగే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది.

సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఏలూరులో 67.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమలాపురంలో 35.2 మి.మీ., భీమవరంలో 30 మి.మీ., ప్రకాశం బ్యారేజీ వద్ద 30 మి.మీ., వేలూరుపాడులో 28 మి.మీ., పాలకోడేరులో 27 మి.మీ., కైకలూరులో 24 మి.మీ. వర్షం నమోదైంది. రేపల్లె, తెనాలి, లాం ప్రాంతాల్లో 22 మి.మీ., సంతమాగులూరులో 21 మి.మీ., నరసాపురం, ముసలిపట్నం, అమరావతిలో 20 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే తీవ్ర వాయుగుండం ఏర్పడినా రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మొదట ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసినా, వాయుగుండం దిశ మార్చుకుని ఉత్తరం వైపు కదలడంతో భారీ వర్షాల అవకాశం తగ్గిపోయింది. దీంతో కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా మోస్తరు వర్షాలకే పరిమితమైంది.

ఇదిలా ఉండగా, ఈ నెల 27వ తేదీ వరకు రాష్ట్రంలో సగటు వర్షపాతం లోటు 54 శాతానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు చురుకుగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కనిపిస్తున్నా వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో వర్షాలు కురవకపోతే ఖరీఫ్ పంటలపై ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us