Cyclone Murasu: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుఫాను.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

తీవ్ర తుపాను మురసు నవంబర్ 3 తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంటల మధ్య ఒంగోలు సమీపంలో నెల్లూరు–నరసాపురం తీర ప్రాంతం వద్ద తీరం దాటింది. తుపాను తీరం దాటినప్పటికీ ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన కొనసాగుతోంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

Cyclone Murasu: ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుఫాను.. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Cyclone Murusu Updates

Edited By:

Updated on: Nov 03, 2026 | 8:25 AM

తెలుగు రాష్ట్రాల‌కు ముర‌సు తుపాను రూపంలో మ‌రో ముప్పు ముంచుకొచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన‌ మురసు తీవ్ర తుపానుగా మారి.. విధ్వంసం సృష్టించింది.. మురసు తీవ్ర తుఫాను నెల్లూరు- నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య తుపాను తీరం దాటిందని ఎస్డీఎంఏ-ఎండీ, ఆర్టీజీఎస్- సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.. ఏదైనా సమస్య ఎదురైనా, ఏ సమయమైనా 9552300009 మన మిత్ర ద్వారా తెలియజేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది.. తీరం దాటినప్పటికి భారీ వర్షాలు కురుస్తాయని.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది. తుపాను ప్రభావంతో 100-120కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారింది. మురసు ఎఫెక్ట్‌తో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 50 మీటర్లు ముందుకు వచ్చింది.  తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు..

మురసు తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని.. అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇప్పటికే ఏపీలోని పలు పోర్టుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం, , వాడరేవు హార్బర్‌లో 10, మచిలీపట్నంలో 9, కృష్ణపట్నంలో 8వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, కళింగపట్నంలో 3వ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

పలు రైళ్లు రద్దు..

బాపట్ల జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సూర్యలంక బీచ్‌లో సముద్రం 40 అడుగులు ముందుకు వచ్చింది. అలల ఉద్ధృతికి వ్యాపారుల తోపుడు బండ్లు, పర్యాటకులు విశ్రాంతి తీసుకునే బల్లలు కొట్టుకుపోయాయి. నెల్లూరు జిల్లాలో 37 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. విజయవాడ, గూడూరు మార్గంలో పలు రైళ్లను మంగళవారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us