Andhra: తుఫాన్ తీరం దాటినా ముప్పు పోలేదు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

‘అర్నాబ్’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు.

Andhra: తుఫాన్ తీరం దాటినా ముప్పు పోలేదు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
Andhra Weather

Updated on: Oct 28, 2026 | 6:44 PM

అమరావతి: ‘అర్నాబ్’ తుపాను వాయువ్య దిశగా కదులుతూ, రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం తీరాలకు సమీపంలోని నరసాపురం వద్ద తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గత ఆరు గంటల్లో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను.. బుధవారం మధ్యాహ్నానికి బలహీనపడి, ఈ రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.

మూడు జిల్లాలకు భారీ వర్ష సూచన

తుపాను ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేశారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

సహాయక చర్యలకు 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

తుపాను ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం ముందస్తుగా 16 ఎన్డీఆర్‌ఎఫ్‌, 11 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అనకాపల్లి (3), కాకినాడ (3), కోనసీమ (4), తూర్పుగోదావరి (2), ఏలూరు (1), పశ్చిమగోదావరి (2), కృష్ణా (2), శ్రీకాకుళం (2), బాపట్ల (1), అల్లూరి (2), పోలవరం (2), మన్యం (1), ఎన్టీఆర్ (1), విశాఖపట్నం (1) ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు. వీటిలో నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఒడిశా నుంచి, మరో మూడు ఢిల్లీ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక, పోలీసు సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడం, రాకపోకలను పునరుద్ధరించడం వంటి పనులు చేపడుతున్నారు.

పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు

బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్య ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణా జిల్లా, చల్లపల్లి: 111.7 మి.మీ.

బాపట్ల జిల్లా, గూడవల్లి: 104 మి.మీ.

కృష్ణా జిల్లా, తరకటూరు: 102 మి.మీ.

బోడగుంట: 101 మి.మీ.

కృష్ణా జిల్లా, ఘంటశాల: 100 మి.మీ.

గూడూరు: 97 మి.మీ.

కాకినాడ జిల్లా, చేబ్రోలు: 92 మి.మీ.

కృష్ణా జిల్లా, నాగాయలంక: 89.5 మి.మీ.

హంసలదీవి: 88 మి.మీ.

తుపాను బలహీనపడుతున్నప్పటికీ, భారీ వర్షాలు, ఈదురుగాలులు, ఆకస్మిక వరదల ప్రమాదం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us