
చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో మధ్యవర్తిత్వం మర్డర్ కు కారణమైంది. ఒక కారు పంచాయతీ హత్యకు ప్లాన్ చేసింది. పక్కా ప్లాన్ తో మర్డర్ స్కెచ్ వేసిన ఫ్యామిలీ అడ్డంగా బుక్ అయింది. వివరాల్లోకి వెళ్తే.. కార్వేటినగరం మండలం తురకమిట్టకు చెందిన యుగంధర్‌కు, అదే మండలం కేఎం పురానికి చెందిన ప్రదీప్ రాజు కుటుంబంతో స్నేహం ఉంది. ఈ పరిచయంతో యుగంధర్ తనకు తెలిసిన వ్యక్తి నుంచి ప్రదీప్ రాజుకు కారును అద్దెకు ఇప్పించాడు. అయితే అద్దెకు తీసుకున్న కారుతో ప్రదీప్ రాజు కుటుంబం ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కారు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు అద్దె బకాయిలు రూ.3 లక్షలు చెల్లించలేదు.. దీంతో యుగంధర్ ప్రదీప్ రాజును నిలదీయగా ఇద్దరి మధ్య వివాదం మొదలై క్రమంగా పెద్దదైంది.
ఈ నెల 9న ప్రదీప్ రాజుకు సన్నిహితుడైన లీలా కుమార్‌ను యుగంధర్ కలిశాడు. కారు విషయంలో ప్రదీప్ రాజుతో జరిగిన గొడవ గురించి అతనికి వివరించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రదీప్ రాజు కుటుంబ సభ్యులు అదే రోజు యుగంధర్‌తో గొడవకు దిగారు. దీంతో యుగంధర్ తన స్నేహితుడు ప్రభుదాస్‌తో కలిసి కార్వేటినగరం పోలీసులను ఆశ్రయించి ప్రదీప్ రాజు కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ప్రదీప్ రాజుకు ఫోన్ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు.
దీంతో ఆగ్రహానికి గురైన ప్రదీప్ రాజు కుటుంబ సభ్యులు యుగంధర్‌పై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. యుగంధర్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్నాడనే సమాచారంతో అతడిని హతమార్చేందుకు పథకం రచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్న యుగంధర్‌ను అతని స్నేహితుడు ప్రభుదాస్‌తో కలిసి ప్రయాణిస్తుండగా ప్రదీప్ రాజు కుటుంబ సభ్యులు కారుతో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో యుగంధర్ మృతి చెందాడు. అయితే ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకునేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానించారు.
యుగంధర్ మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో హత్య కోణం వెలుగులోకి రావడంతో ప్రదీప్ రాజు, అతని సోదరుడు దిలీప్ రాజు, స్నేహితుడు లీలా కుమార్, తల్లి విజయలక్ష్మిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు రవికుమార్ రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కారు అద్దెకు ఇప్పించి మధ్యవర్తిగా వ్యవహరించిన యుగంధర్ చివరకు అదే కారు వివాదంలో ప్రాణాలు కోల్పోవడం కార్వేటినగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కుమారుడిని కోల్పోయిన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.