Andhra Pradesh: యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటే.. ఆ బండి కింద దాగున్న భయంకరమైన నిజం ఏంటంటే..?

చూడటానికి రోడ్డు ప్రమాదం.. కానీ లోతుగా విచారిస్తే వెలుగులోకి వచ్చిన భయంకరమైన హత్య.. భార్యను వేధిస్తున్నాడని తోడల్లుడినే అంతం చేశాడు ఒక కానిస్టేబుల్. చిలకలూరిపేటలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు..? ఆ ఫోన్ పే ట్రాన్సాక్షన్ నిందితుడిని ఎలా పట్టించింది? అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: యాక్సిడెంట్ అనుకుంటే పొరపాటే.. ఆ బండి కింద దాగున్న భయంకరమైన నిజం ఏంటంటే..?
Chilakaluripet Lawyer Murder Case

Edited By:

Updated on: Apr 12, 2026 | 1:57 PM

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద కలకలం రేపిన మృతదేహం కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొదట రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ ఘటనను పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా స్వయానా తోడల్లుడే ప్రాణం తీసినట్లు తేలింది. మద్యం మత్తులో భార్యను వేధిస్తున్నాడన్న కోపంతో కానిస్టేబుల్ తన వృత్తిని అడ్డం పెట్టుకుని సినిమా ఫక్కీలో చేసిన ఈ హత్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. యడవల్లి వద్ద తెల్లవారుజామున యువకుడు బైక్ కింద పడి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుత దానిని యాక్సిడెంట్ గానే భావించారు. అయితే మృతదేహం పక్కనే రక్తంతో తడిసిన రాయి ఉండటం, బైక్ పడి ఉన్న తీరుపై అనుమానం రావడంతో క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. మృతుడిని ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరానికి చెందిన న్యాయవాది శ్రీరాం హరిప్రసాద్‌‌గా గుర్తించారు.

హత్యకు దారితీసిన కలహాలు

పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. మృతుడి భార్య తరచూ తన అక్క వద్దకు వెళ్లి, తన భర్త మద్యం తాగి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసేది. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆమె భర్త వెంకట కోటయ్య.. ఈ ఫిర్యాదులతో విసిగిపోయి తన తోడల్లుడైన హరిప్రసాద్‌ను అడ్డుతొలగించాలని స్కెచ్ వేశాడు. మూడు రోజుల క్రితం హరిప్రసాద్‌ను నర్సరావుపేటకు రప్పించిన కానిస్టేబుల్, అతనికి మద్యం తాగించాడు. మద్యం తాగిన తర్వాత హరిప్రసాద్ బైక్‌పై బయలుదేరగా కోటయ్య తన స్నేహితుడితో కలిసి మరో బైక్‌పై అతడిని వెంబడించాడు. యడవల్లి సమీపంలో ఏకాంతంగా ఉన్న ప్రాంతంలో హరిప్రసాద్‌ను ఆపి, పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఒక రాయిని రక్తంలో ముంచి పక్కన పడేశారు. అనంతరం హరిప్రసాద్ బైక్‌ను అతని మృతదేహంపై పడేలా చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసుల దర్యాప్తు.. ఫోన్ పే పట్టించింది

సిసి టీవీ విజువల్స్ పరిశీలించగా, హరిప్రసాద్‌ను ఒక బైక్ వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులెవరో క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే వారు మద్యం కొనుగోలు చేసిన షాపులో డిజిటల్ ట్రాన్సాక్షన్లను తనిఖీ చేయగా కానిస్టేబుల్ చేసిన ఫోన్ పే పేమెంట్ ద్వారా నిందితులను ఖచ్చితంగా గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో కానిస్టేబుల్, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిందితుల అరెస్టును అధికారికంగా చూపే అవకాశం ఉంది. చట్టాన్ని కాపాడాల్సిన కానిస్టేబులే, చట్టం తెలిసిన లాయర్‌ను చంపడం జిల్లాలో సంచలనం సృష్టించింది.

Follow Us