అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం లభించింది. అయోధ్య శ్రీరామ మందిరాన్ని అలంకరించనున్న ఈ వీణను బొబ్బిలి శిల్పి సర్వసిద్ధి గంగాధరాచారి రెండున్నర సంవత్సరాలు శ్రమించి రూపొందించారు. మరుగున పడుతున్న కళకు తిరిగి జీవం పోస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!
Bobbili Veena

Edited By:

Updated on: Jul 19, 2026 | 8:21 PM

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణకు మరో విశిష్ట గౌరవం దక్కనుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ సంగీత వాయిద్యం త్వరలో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని అలంకరించనుంది. బొబ్బిలి ప్రాంతానికి చెందిన కళాకారుల నైపుణ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన వీణను రామాలయానికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వీణను బొబ్బిలికి చెందిన ప్రముఖ శిల్పి సర్వసిద్ధి గంగాధరాచారి సంప్రదాయ పద్ధతిలో రూపొందించారు.

ఒకే చెక్క ముక్కతో అత్యంత నైపుణ్యంతో చెక్కిన ఈ వీణ తయారీకి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పట్టింది. వీణ నిర్మాణంలో నాణ్యతతో పాటు సాంప్రదాయ శిల్పకళకు ప్రాధాన్యం ఇచ్చారు. రోజ్‌వుడ్‌తో రూపొందించిన ఈ వీణలో 24 ఫ్రెట్లు అమర్చగా, దీని బరువు సుమారు 55 కిలోలు ఉంటుంది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన చొరవతో ఈ ప్రత్యేక వీణను అయోధ్య రామాలయానికి బహూకరించేందుకు చర్యలు చేపట్టారు. ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన అనుమతులు కూడా పొందినట్లు తెలుస్తోంది.

ఈ వీణను రామాలయంలో ప్రతిష్ఠించడం ద్వారా ఉత్తరాంధ్ర కళా సంపదకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని స్థానిక కళాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బొబ్బిలి వీణకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు లభించింది. అయినప్పటికీ ఈ కళను కొనసాగిస్తున్న కళాకారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయోధ్య వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో బొబ్బిలి వీణకు స్థానం దక్కడం వల్ల ఈ కళ పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక సంగీత వాయిద్యం రామాలయానికి చేరడం మాత్రమే కాకుండా, ఉత్తరాంధ్ర కళా వైభవం దేశానికి పరిచయం అవుతున్న చారిత్రక ఘట్టంగా పలువురు భావిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us