రాచరిక వైభవానికి ప్రతీక.. బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలకు పూజలు

చారిత్రక బొబ్బిలి కోటలో ఆయుధ పూజ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం బొబ్బిలి కోటలోని దర్బార్ మహల్‌లో రాజవంశీయులు ఆయుధ పూజను ప్రతి సంవత్సరంలానే ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా బొబ్బిలి రాజవంశ ఆచారాలు ఆచారాలు కొనసాగుతున్నాయి. బొబ్బిలి కోటలో నాటి శౌర్యానికి నీరాజనం పలికారు.

రాచరిక వైభవానికి ప్రతీక.. బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలకు పూజలు
Bobbili Royal Family

Updated on: Oct 19, 2026 | 8:34 PM

రాజాధిరాజా అంటూ సేవకులు రాజావారి కోటలో కవాతు చేశారు. కత్తులు, కటార్లు, డాళ్లు, బరిసెలు, తుపాకీలు చేతపట్టుకుని కదం తొక్కారు. అదే సమయంలో వజ్ర వైడూర్యాలు పొదిగిన తలపాగా, ఆభరణాలు, రత్నాలు పొదిగిన కత్తులతో, రాజరిక దుస్తులు ధరించి సంప్రదాయబద్ధంగా కోట లోపల నుండి బయటకు వచ్చారు బొబ్బిలి రాజవంశీయులు. అలా వచ్చిన రాజవంశీయులకు అక్కడున్న వారంతా ఘన స్వాగతం పలికారు.

ఆచార వ్యవహారాలు, మేళతాళాలతో రాజవంశీయులు హుందాగా ముందుకు నడుస్తుండగా.. సేవకులు వారిని దర్బార్ మహల్ కి తోడ్కొని వెళ్లారు. సింహాసనంపై దివంగత రంగారావు ఫోటో ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. నేటికీ రాచరికానికి నిలువుటద్దంలా ప్రతిబింభించే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చారు.

విజయదశమి సందర్భంగా బొబ్బిలి కోటలో జరిగే ఆయుధ పూజ అందరినీ ఆకట్టుకుటుంది. చారిత్మాత్మక బొబ్బిలి యుద్ధం 1757లో జరిగింది. యుద్ధం జరిగి వందల సంవత్సరాలు అయినా నాటి జ్ఞాపకాలు మాత్రం నేటికీ మిగిలే ఉన్నాయి. ఆ తరువాత రోజుల్లో బొబ్బిలి వారసులు తిరిగి తమ రాజ్యాన్ని పునర్ నిర్మించుకున్నారు. అప్పటి నుండి బొబ్బిలి వారసులు నాటి యుద్ధంలో వాడిన ఆయుధాలను శౌర్య పరాక్రమాలకు చిహ్నంగా భద్రపరిచారు. వాటి కోసం దర్బార్ హల్ లో ఒక మ్యూజియంను ఏర్పాటు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచారు.

అలా భద్రపరిచిన ఆయుధాలను ప్రతి ఏటా విజయదశమి సందర్భంగా బయటకు తీసి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయుధ పూజను బొబ్బిలి రాజవంశీయుల వారసులైన మాజీమంత్రి రావు సుజయ కృష్ణ రంగారావు బహుదూర్, ఆయన సోదరుడు ఎమ్మెల్యే బేబి నాయనలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

ఈసారి ఆయుధపూజ కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకున్నామన్నారు బొబ్బలి రాజవంశీయులు, ఎమ్మెల్యే బేబీ నాయన. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఆయుధపూజ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజులు, రాజ్యాలు కనుమరుగైనా.. నాటి సాంప్రదాయాలను బొబ్బిలి రాజవంశీయులు ఇప్పటికీ కొనసాగిస్తూ ఆచారాలను పాటిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us