
ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక ఆనవాయితీ ఉంటే ఒక్క ఒంటిమిట్ట దేవాలయంలో మాత్రం భిన్న ఆచారం ఒకటి ఉంది. అన్ని రామాలయాలలో నవమి రోజే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం నవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నిండు వెన్నెల్లో సీతారాముల వారి కళ్యాణాన్ని రాత్రి పూట చేస్తారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ఏకశిలా నగరంగా పిలవబడే ఈ ప్రాంతంలో ఉన్న కోదండ రాముల వారి దేవాలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుంది. కానీ, ఒంటిమిట్ట దేవాలయంలో మాత్రం నవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు పండు వెన్నెలలో చంద్రుడు చూస్తుండగా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు.
ఎందుకంటే సీతారాముల కళ్యాణాన్ని నాకు చూడాలని ఉంది అని చంద్రుడు దేవతలను కోరినప్పుడు.. అన్నిచోట్ల ఉదయం రోజు శ్రీరామనవమి జరుపుకుంటున్నారు కాబట్టి ఏకశిలా నగరంగా ఉండే జాంబవంతుడు నిర్మించిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నిండు పౌర్ణమి రోజు వెన్నెలలో సీతారాముల కళ్యాణం జరుగుతుందని దేవతలు చెప్పినట్లు ప్రతీతి. అప్పటి నుంచి ఒంటిమిట్ట దేవాలయంలో నవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు చూస్తుండగా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందని స్థలపురాణం చెబుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒంటిమిట్టలో జరిగే రాముల వారి కళ్యాణాన్ని ప్రభుత్వ పండుగ జరుపుతున్నారు. కాబట్టి అప్పటినుంచి సీతారాముల వారి కళ్యాణం భద్రాచలంలో జరిగే సమయానికి ఒంటిమిట్టకు భద్రాచలం నుంచి గోటితో ఒలిచిన తలంబ్రాలు, ముత్యాలను ఒంటిమిట్టకు పంపిస్తారు. అందులో భాగంగా ఈసారి కూడా భద్రాచలం రాముల వారి తలంబ్రాలు ఒంటిమిట్టకు చేరాయి.