
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి ప్రస్తుతం వాయుగుండంగా మారింది.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రానున్న కొన్ని గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. వాయుగుండం డీప్ డిప్రెషన్‌గా బలపడి సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయుగుండం తీరం వైపు కదులుతున్న కొద్ది ఉత్తరాంధ్ర పై దాని ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 25వ తేదీ వరకు కూడా వర్షాలు, గాలుల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా లోతట్టు ప్రాంతాల పైనా కనిపించే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారుల పై వరదనీరు ప్రవహించడం, కల్వర్టులు, చిన్న వాగులు పొంగిపొర్లడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే తడిగా ఉన్న నేలల్లో మరింత వర్షం పడితే వ్యవసాయ పనులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
మరోవైపు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. వాయుగుండం ప్రభావం పెరిగే సమయంలో సముద్రంలోకి వెళ్లకపోవడం, ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, బలహీనంగా ఉన్న నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గాలుల సమయంలో బయటకు వెళ్లడం, చెట్ల కింద లేదా విద్యుత్ లైన్ల సమీపంలో నిలబడటం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము వరకు వాయుగుండం తీరం దాటే ప్రక్రియ కీలకం కానుంది. అయితే విశాఖ, గోపాలపూర్ మధ్యే ల్యాండ్‌ఫాల్ ప్రాంతంగా ప్రస్తుతం అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు..
ఏపీతోపాటు సెప్టెంబర్ 24 ఉదయం నుండి సెప్టెంబర్ 25 రాత్రి వరకు తెలంగాణపై వాయుగుండం ప్రభావం అత్యధికంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని తూర్పు తెలంగాణ జిల్లాల్లో (బ్రౌన్ జోన్) సెప్టెంబర్ 24-25 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. హైదరాబాద్ సిటీ సహా మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..