
కార్తీక పౌర్ణమి పర్వదినం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. భక్తిశ్రద్ధలతో వెలిగించిన కార్తీక దీపాలే ఇద్దరు చిన్నారుల ప్రాణాలను బలిగొన్నాయి. ఆడుతూ పాడుతూ ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచాల్సిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం విపి రేగ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎర్రవెల్లి వర్ష (4), ఎర్రవెల్లి ధనుష్ (7) గెడ్డలో పడి మృత్యువాత పడ్డారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఉదయం పారుతున్న గెడ్డ నీటిలో దీపాలు వదిలారు. ఈ క్రమంలో నీటి పై తేలుతున్న దీపాలను పట్టుకునేందుకు చిన్నారులు ప్రయత్నించారు.
ఈ సమయంలో.. ప్రమాదవశాత్తూ కాలు జారి ఇద్దరూ గెడ్డలో పడిపోయారు. చిన్నారులు నీటిలో మునిగిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నీటిలో ఉన్న చిన్నారులను బయటకు తీసి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన విషాదం జరిగిపోయింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చిరునవ్వులు పూయించిన చిన్నారులు ఇక లేరన్న నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పండుగ రోజున చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. కార్తీక దీపాల వెలుగులు నిండాల్సిన వేళ ఇద్దరు చిన్నారుల జీవితాల్లో చీకట్లు అలముకోవడం గ్రామంలో ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..