Andhra Pradesh: కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఏపీ టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సోలార్ బోట్లను తీసుకొచ్చింది. డీజిల్ బోట్ల స్థానంలో వీటని కొత్తగా ప్రవేశపెట్టింది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి.

Andhra Pradesh: కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం
Solar

Edited By:

Updated on: Jul 03, 2026 | 6:09 PM

కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ కొత్త అడుగు వేయనుంది. డీజిల్ బోట్లకు ప్రత్యామ్నాయంగా సోలార్ శక్తితో నడిచే మెకనైజ్డ్ బోట్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జరిగిన ఏపీటీడీసీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోగా.. సోలార్ బోటు నమూనాను కూడా సభ్యులకు ప్రదర్శించారు. ప్రయోగాత్మకంగా నాలుగు సోలార్ మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ ప్రాంతంలో ఏడాది పొడవునా సూర్యకాంతి ఎక్కువగా లభించే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నాలుగు బోట్లను బెజవాడ డివిజన్‌కు కేటాయించనున్నారు. ప్రస్తుతం కృష్ణానదిలో పర్యాటక సేవల కోసం డీజిల్‌తో నడిచే మెకనైజ్డ్ బోట్లు వినియోగంలో ఉన్నాయి. డీజిల్ ధరల పెరుగుదలతో నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుండటంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ సోలార్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీటీడీసీ నిర్ణయించింది.

సాధారణ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.30 లక్షలు కాగా.. సోలార్ మెకనైజ్డ్ బోటు ధర సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. నాలుగు బోట్ల కొనుగోలుకు దాదాపు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందుకోసం టెండర్లు లేదా కొటేషన్లు ఆహ్వానించి, తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వనున్నారు. ఒకటి నుంచి రెండు నెలల్లో ఈ బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సోలార్ బోట్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి డీజిల్ బోట్లతో పోలిస్తే శబ్దం తక్కువగా చేస్తాయి. దీంతో పర్యాటకులు కృష్ణానది సహజసౌందర్యాన్ని ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

అలాగే డీజిల్ వినియోగం తగ్గడంతో నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది. అదేవిధంగా ప్రస్తుతం వినియోగంలో ఉన్న మెకనైజ్డ్ బోట్లు, భారీ క్రూయిజర్ బోట్లను కూడా సోలార్ వ్యవస్థకు అనుగుణంగా మార్చే అవకాశాలపై ఏపీటీడీసీ పరిశీలిస్తోంది. ఈ మార్పులకు అవసరమైన వ్యయం, సాంకేతిక అంశాలపై నిపుణులు మరియు సంబంధిత కంపెనీలతో చర్చలు జరిపే యోచనలో ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో గోదావరి, కృష్ణా పుష్కరాల నాటికి మరిన్ని సోలార్ బోట్లను ప్రవేశపెట్టే దిశగా ఏపీటీడీసీ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Follow Us