AP Municipal Elections: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు రీషెడ్యూల్.. మళ్లీ ఎప్పుడంటే?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జరగబోయే 99 పట్టణ, నగర స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను నాలుగు రోజుల పాటు వాయిదా వేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు రీషెడ్యూల్.. మళ్లీ ఎప్పుడంటే?
Ap Municipal Elections Rescheduled

Updated on: Oct 22, 2026 | 10:13 PM

ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 100 పట్టణ స్థానిక సంస్థల 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు ఎన్నికల షెడ్యూల్‌ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా ఈ సవరించిన షెడ్యూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న ఘటనలపై కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసుల నివేదికలతో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అందించిన ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించింది. కొన్ని పట్టణ స్థానిక సంస్థల్లో అభ్యర్థులను బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చించివేయడం వంటి ఘటనలు జరిగినట్లు గుర్తించిన ఎస్ఈసీ, నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని నిర్ణయించింది.

కడప, రాజంపేట, మైదుకూరు, తిరుపతి పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలు గడువును మరో 48 గంటల పాటు పొడిగించారు. అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇప్పటికే నోటిఫై చేసిన కేంద్రాలతో పాటు కలెక్టరేట్లలోనూ నామినేషన్లు దాఖలు చేసే వెసులుబాటు కల్పించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో 11 వార్డులకు , రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులకు , మైదుకూరు మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకు , తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 18 వార్డులకు ఈ అదనపు నామినేషన్ల దాఖలు అవకాశం కల్పించారు.

ఈ నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 25న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కేవలం కొత్తగా నామినేషన్లు వేసిన అభ్యర్థులకు మాత్రమే అక్టోబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అవసరమైన చోట్ల నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, మేయర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ విడిగా విడుదల చేయనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us