
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృతనిశ్చయంతో ఉంది. రెవెన్యూ శాఖకు అందే ఫిర్యాదుల్లో అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఇది ఒకటి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి నెలా రెండో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతున్నట్లే, 22ఏ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. నెల రోజుల పాటు మాసోత్సవాలు నిర్వహించి, ఈనాం భూములతో పాటు వివిధ రకాల 22ఏ భూముల సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమ లక్ష్యం. సమస్య శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ యంత్రాంగం మొత్తాన్ని మోహరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీసీఎల్‌ఏ స్థాయిలోనే ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించి, కలెక్టర్లకు పంపి చర్యలు తీసుకునేలా కేంద్రీకృత విధానం అమలు చేయనుంది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో విడుదల కానున్నాయి. నేడు జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
22ఏ జాబితాలో మాజీ సైనికులు, ప్రస్తుతం పనిచేస్తున్నవారు, స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూములు, రాజకీయ బాధితులు, 1954 కంటే ముందు జరిగిన అసైన్‌మెంట్ భూములు, షరతు గల పట్టాలు, చుక్కల భూములు, సర్వీస్ ఈనాములు, కొందరు రైతుల ప్రైవేటు పట్టాభూములు, అలాగే కొంత విస్తీర్ణమే 22ఏ కింద ఉన్నా మొత్తం సర్వే నంబర్‌ను పెట్టేసినటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే జనవరి 1న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఐదు రకాల భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగించేందుకు ఆదేశాలు ఇచ్చారు. అవి: స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ఇచ్చినవి. మాజీ సైనికోద్యోగులు, ప్రస్తుత సైనికోద్యోగులకు ఇచ్చినవి. 1954 జూన్ 18కి ముందు ఎసైన్ చేసినవి. ప్రైవేటు పట్టాదారులకు చెందినవి. ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ, దేవాదాయ, ప్రైవేటు వ్యక్తుల భూమి ఉంటే ప్రైవేటు వ్యక్తుల భూమికి విముక్తి కల్పించడం. జిల్లా కలెక్టర్ల నుంచి తాజా 22ఏ జాబితాలు అందిన తర్వాత అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతువారీ పట్టాలు కలిగిన ఈనాం భూముల్ని కూడా 22ఏ జాబితాలో పెట్టారు. వీరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా, దశాబ్దాలుగా బ్యాంకుల్లో తనఖా పెట్టి పంట రుణాలు తీసుకున్నప్పటికీ, రీసర్వే సమయంలో వీటిని 22ఏ కిందకు చేర్చారు.
వెబ్‌ల్యాండ్ 1.0 ఆధారంగా నమోదు చేసి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. కానీ అప్పట్లో రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సర్వీసు ఈనాం భూములే 1,37,000 ఎకరాలు చిక్కుల్లో ఉన్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన భూములు కూడా 22ఏ జాబితాలోనే ఉన్నాయి. 10 ఏళ్లు దాటిన వాటిని ఫ్రీ హోల్డ్ చేయొచ్చనే నిబంధనలున్నా అమలు కావడం లేదు. ఇలాంటి సమస్య ఒక్కో మండలంలో 2,000కు పైగా ఉంది. రాష్ట్రంలో 13.59 లక్షల ఎకరాల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో నిబంధనల ప్రకారం చేసినవి 7.85 లక్షల ఎకరాలే కాగా, 5.74 లక్షల ఎకరాలకు సంబంధించి అడ్డగోలుగా వ్యవహరించారు. 22ఏ భూముల జాబితా నుంచి తొలగించాలని భూ యజమానులు దరఖాస్తు చేసుకున్నా, జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోల స్పందన కరువవుతోంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా చూపాలో తెలియజేస్తూ మార్గదర్శకాలు జారీ చేస్తున్నా అమలు చేయడం లేదు. దీంతో అర్హత కలిగిన భూముల్ని 22ఏ నుంచి తొలగించేందుకు ఆటో ఐడెంటిఫికేషన్ విధానం అమలు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది.
పట్టా ఈనాం భూమి పొరపాటున 22ఏ జాబితాలో ఉంటే, అలాంటి వాటిని ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించి నేరుగా కలెక్టర్ లాగిన్‌కు పంపిస్తారు. 15 రోజుల్లోగా వాటిని తొలగించాలి. ఒకవేళ 22ఏ లోనే ఉంచాలంటే తగిన కారణాన్ని తెలియజేస్తూ సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేయాలి. లేకుంటే వాటిని 22ఏ నుంచి తొలగిస్తారు. ఒకసారి 22ఏ నుంచి తొలగిస్తే మళ్లీ చేర్చడానికి వీలుండదు. కలెక్టర్ వాటిని తొలగించిన వెంటనే వెబ్‌ల్యాండ్ 2.0, రిజిస్ట్రేషన్ శాఖల్లో దానంతట అదే అప్‌డేట్ అవుతుంది. దేవాదాయ, వక్ఫ్ భూముల దరఖాస్తులు రెవెన్యూ అధికారుల వద్ద ఆగకుండా నేరుగా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్, వక్ఫ్ ఇన్‌స్పెక్టర్‌కు వెళ్తాయి. వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో వీరికి ప్రత్యేక లాగిన్ కల్పిస్తారు. దీని ద్వారా వారు భూ రికార్డుల్ని పరిశీలించి, క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా దేవాదాయ కమిషనర్, వక్ఫ్ బోర్డు సీఈవో నిర్ణయం తీసుకుంటారు. వారి ఆమోదం వెంటనే రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్‌కు చేరుతుంది, ఆ భూమిపై ఉన్న నిషేధం తొలగుతుంది. పురపాలికల్లో విలీనమైన గ్రామాలకు సంబంధించి పట్టణ ఆస్తుల రిజిస్టర్ ప్రామాణికంగా తీసుకుంటారు. పొరపాటున 22ఏ కింద నమోదైన వాటిని కమిషనర్ సిఫార్సు మేరకు కలెక్టర్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పంపి తొలగిస్తారు. గ్రామ కంఠం భూములైతే స్వామిత్వ పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్ని వేరు చేస్తారు, వాటికి వెబ్‌ల్యాండ్ 2.0లో ప్రత్యేక చైల్డ్ ఎల్‌పీఎంలుగా గుర్తిస్తారు. ఈ సమగ్ర చర్యల ద్వారా 22ఏ భూముల సమస్యకు శాశ్వత, పారదర్శక పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
Also Read: పంటి నొప్పి 10 నిమిషాల్లో తగ్గాలంటే ఈ ఆకు తింటే చాలు..!