
ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులను ప్రతీ నెలా నిర్వహిస్తోంది. ప్రతీ నెల ప్రారంభంలో అన్ని గవర్నమెంట్ విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వీటిని ఏర్పాటు చేస్తోండగా.. ఫిబ్రవరిలో కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఉచితంగా ఆధార్ కార్డుల్లోని బయోమెట్రిక్, ఇతర వివరాలను అప్డేట్ చేయించుకోవచ్చు. ఇందుకోసం గ్రామం నుంచి పట్టణాల్లో ఉండే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లాల్సిన వ్యయప్రయాసాలు తప్పుతాయి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో ఆధార్ అప్డేట్‌కు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ ఈ స్పెషల్ క్యాంపుల్లో ఉచితంగానే సేవలు అందిస్తారు.
ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు కూడా మళ్లీ నిర్వహించనుంది. పిల్లలు చిన్న వయస్సులో ఆధార్ తీసుకుంటారు. దీంతో పెద్దయ్యాక బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో చాలామంది విద్యార్థులు ఇంకా అప్డేట్ చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా వీటిని నిర్వహిస్తున్నారు. 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ అప్డేట్ చేయించుకుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. దీంతో తల్లిదండ్రులు ఈ అవకాశం ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయించాలని అధికారులు తన ప్రకటనలో తెలిపారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి ఏపీలోని విద్యాసంస్థల్లో ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది తల్లిదండ్రుల తమ పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయించడం లేదు. దీంతో ప్రభుత్వం వీటిని ప్రతీ నెలా కొనసాగిస్తూ వస్తోంది. పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్ చేయిచంకపోతే వినియోగించే సమయంలో సమస్యలు రావొచ్చు. ప్రభుత్వ పథకాలు, ఇతర బెనిఫిట్స్ ఆగిపోయే అవకాశముంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి స్పెషల్ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఎంఈవోలను సంప్రదించి ఈ సెంటర్ల వివరాలను పొందవచ్చు. కాగా చిన్నతనంలో ఆధార్ తీసుకునే సమయంలో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు తర్వాత పనిచేయవు. దీంతో పెద్ద అయ్యాక వాటిని అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనిని యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.