
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. నామినేషన్ల దాఖలు సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ), వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ ధ్రువపత్రాలు సమర్పించలేదనే కారణంతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ల నుంచి ఎన్‌ఓసీ తీసుకురాలేదని, ప్రభుత్వంలోని ఏదైనా శాఖ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించలేదని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం సరికాదని పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిబంధనల్లో ఈ సర్టిఫికెట్ల సమర్పణ తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలనకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని, అనవసర కారణాలతో అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ల పరిశీలన విషయంలో కీలక స్పష్టత లభించినట్లయింది. అయితే, ఇతర తప్పనిసరి అర్హతలు, ఎన్నికల నిబంధనలను అభ్యర్థులు యథావిధిగా పాటించాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..