TDP MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సర్వీసులో ఉండగా.. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారంటూ అశోక్ బాబు (Ashok Babu) పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఐడీ కోర్టు (AP CID Court) శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచికత్తుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అరెస్టు అనంతరం దాదాపు 17 గంటలపాటు అశోక్‌బాబును గుంటూరులోని సీఐడీ కార్యాలయంలోని ఉంచి అధికారులు విచారించారు. అనంతరం కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్ రావడంతో అశోక్ బాబును న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఫోర్జరీ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి అశోక్‌బాబుకు బెయిల్ మంజూరు చేశారు. కాగా.. టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో జడ్జి నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.
కాగా.. అశోక్ బాబు అరెస్టుపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తంచేసింది. తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని.. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే వైఎస్ జగన్ ప్రభుత్వం కక్షగట్టిందంటూ మండిపడ్డారు. అశోక్ బాబు అరెస్ట్‌పై పలువురు టీడీపీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read: