అధికారులు లేరు.. పోలీసులు లేరు.. అయినా పక్కాగా పంచాయతీ పోలింగ్! ఆ గ్రామం ఐడియా అదుర్స్..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల వేళ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామస్థులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయంలో ఇద్దరి మధ్య పోటీ నెలకొనడంతో అధికారుల ప్రమేయం లేకుండానే రహస్య బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు. గ్రామస్థుల ఓట్ల ఆధారంగా ప్రజాబలం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామస్థులంతా పాల్గొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అధికారులు లేరు.. పోలీసులు లేరు.. అయినా పక్కాగా పంచాయతీ పోలింగ్! ఆ గ్రామం ఐడియా అదుర్స్..
Dippakayalapadu Panchayat Election

Edited By:

Updated on: Nov 15, 2026 | 7:59 AM

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన వేళ, పల్లె రాజకీయాల్లో వినూత్న ప్రయోగాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు సంబంధించి తొలి దశ ఎన్నికలు ముగిసి, రెండో దశకు రంగం సిద్ధమవుతుండగా, మరోవైపు గ్రామ పంచాయతీల తొలి విడత నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పట్టణ రాజకీయాలకు భిన్నంగా పల్లెల్లో కుల, బంధువర్గ సమీకరణాలతో పాటు రిజర్వేషన్ల అంశం అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల పాటు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేందుకు గ్రామస్థులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట, నరసాపురం, భీమవరం తదితర ప్రాంతాల్లో ఆర్థిక వనరులు కలిగిన ఆశావహులు గ్రామాభివృద్ధికి, ఆలయాల నిర్మాణానికి, పాఠశాలల బాగు కోసం తమ సొంత నిధులను వెచ్చిస్తామంటూ ముందుకొస్తున్నారు. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని కట్టబెడితే గ్రామానికి దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు విరాళాలు అందిస్తామంటూ ప్రతిపాదనలు రావడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, డబ్బుల ప్రలోభాలు, వేలంపాటలకు భిన్నంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడు గ్రామస్థులు పూర్తి ప్రజాస్వామ్యబద్ధమైన విధానాన్ని ఎంచుకుని ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ప్రజాదరణను తెలుసుకునేందుకు ఐవీఆర్ఎస్ సర్వేలు లేదా టెలీకాలర్ల ద్వారా అభిప్రాయ సేకరణ జరుపుతుంటాయి. కానీ దిప్పకాయలపాడులో కూటమి తరఫున సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు వ్యక్తులు పోటీ పడ్డారు.

గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం వారిలో ఇద్దరు పోటీ నుంచి తప్పుకోగా, సుబ్బారావు, బాబూరావు అనే ఇద్దరు అభ్యర్థులు మాత్రం తాము బరిలో ఉండాల్సిందేనని పట్టుబట్టారు. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసేందుకు లాటరీ (డ్రా) పద్ధతిని అనుసరిస్తే అది కేవలం అదృష్టంపై ఆధారపడినట్లు అవుతుంది.. తప్ప, నిజమైన ప్రజాభిప్రాయం ప్రతిబింబించదని గ్రామస్థులు భావించారు. దీంతో ఎవరికి ప్రజాబలం ఉందో తేల్చుకునేందుకు అధికారిక ఎన్నికల కమిషన్ తరహాలోనే ఒక ‘ప్రిలిమినరీ పోలింగ్’ నిర్వహించాలని నిర్ణయించారు. ఎటువంటి ఎన్నికల అధికారులు, పోలీసు బందోబస్తు లేకుండానే గ్రామ యువత, పెద్దలు కలిసి భారీ టెంట్లు వేసి, రహస్య ఓటింగ్ కోసం ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేశారు.

ఈ ముందస్తు ఎన్నిక కోసం అచ్చం అసలు బ్యాలెట్ పేపర్లను పోలిన విధంగా పత్రాలను ముద్రించి, సుబ్బారావు, బాబూరావులకు వేర్వేరుగా ‘ప్రొక్లైనర్’, ‘మర్రిచెట్టు’ గుర్తులను కేటాయించారు. ఇరువురు అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం గ్రామస్థులందరూ ఎంతో ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును రహస్య బ్యాలెట్ విధానంలో వినియోగించుకున్నారు. గతంలో కొన్ని కొల్లేరు ప్రాంత గ్రామాల్లో కట్టుబాట్ల పేరుతో ఇతరులను పోటీ నుంచి తప్పించే సంప్రదాయాలు కనిపించినప్పటికీ, దిప్పకాయలపాడులో మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తితో బ్యాలెట్ ద్వారా అభ్యర్థిని ఎన్నుకోవడం విశేషం..

ప్రలోభాలు, బెదిరింపులకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగే ఇలాంటి ప్రజాస్వామ్య నిర్ణయాలను చాలా మంది స్వాగతిస్తున్నారు.. ఈ ప్రిలిమినరీ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని కూటమి తరఫున అధికారిక బరిలో నిలపడంతో పాటు, గ్రామస్థులంతా ఏకాభిప్రాయానికి వస్తే సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us