
ఏపీలోని చేనేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. నేతన్న సేవలో పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద చేనేతల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున అందించింది. అయితే కొంతమంది అకౌంట్లో డబ్బులు ఇంకా జమ కాలేదు. అర్హత ఉన్నా డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివారికి ప్రభుత్వం ఊరట కలిగించింది. అర్హత ఉండి డబ్బులు పడనివారికి ఈ నెల 20లోగా బ్యాంక్ అకౌంట్లో నిధులు జమ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. నిధులు పడనివారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీంతో దరఖాస్తు చేసుకున్నవారితో పాటు సాంకేతిక కారణాలతో అందనివారికి సొమ్ము విడుదల చేయనున్నారు.
“సాంకేతిక కారణాలతో కొంతమందికి డబ్బులు జమ కాలేదు. అలాంటివారు ఆందోళన పడాల్సిన పని లేదు. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. వాటిని పరిశీలించి అర్హులైనవారికి ఈ నెల 20లోగా బ్యాంక్ అకౌంట్లో రూ.25 వేలు జమ చేస్తాం. అర్హులైనవారు ఎలాంటి టెన్షన్ పడవద్దు. వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ఏవైనా అనుమానాలు ఉంటే సమీపంలోని చేనేత, జౌళిశాఖ అధికారులను సంప్రదించండి. డబ్బులు పడనివారిని గుర్తించి సమస్యను పరిష్కరిస్తాం. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. తప్పుడు వార్తలను నమ్మి భయపడవద్దు. రాష్ట్రంలో మొత్తం 71,536 మంది చేనేతలకు రూ.25 వేల చొప్పున అందించాం. అర్హులైనవారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా అందిస్తాం. 13,678 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే నిధుు పంపిణీ చేస్తాం. ప్రస్తుతం అర్హుల గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది” అని మంత్రి సవిత పేర్కొన్నారు.
-దరఖాస్తుదారుడు ఏపీ నివాసి అయి ఉండాలి
-చేనేత సంఘాల్లో లేదా సొసైటీలో సభ్యుడై ఉండాలి
-సొంతగా మగ్గం కలిగి ఉండి చేనేత వృత్తిపై ఆధారపడుతూ ఉండాలి
-కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లబ్ది
-ఆధార్, చేనేత మగ్గం గుర్తింపు కార్డ్, సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఉండాలి
ఇటీవల సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన చేనేతల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఇప్పటికే నిధులు చేనేతలకు అందాయి. అలాగే చేనేతలకు ఉచితంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. వీటి వల్ల లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు.