ఓ వ్యక్తి తన సోదరికి కానుకగా చీర ఇద్దామని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. కట్ చేస్తే.. మూడు రోజులకు పార్శిల్ ఇంటికొచ్చింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అతడి ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది. స్థానిక పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన ఓ యువకుడు పండుగకు తన సోదరికి చీరను ఇద్దామనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా రూ. 550 విలువ చేసే చీర ఆర్డర్ పెట్టాడు.
ఆ ఆర్డర్ శనివారం ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్‌కు డబ్బులు చెల్లించి.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగానే అతడి కళ్లు బైర్లు కమ్మాయ్. అందులో చీరకు బదులుగా చిరిగినా ప్యాంటు.. అది కూడా ఒక కాలు వరకు ఉండటం చూసి ఆ యువకుడు దెబ్బకు అవాక్ అయ్యాడు. ఇదేంటని డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా.. తనకు ఏం తెలియదని రిటర్న్ ఆప్షన్ పెట్టుకోవాలని సూచించాడు. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయని.. జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేసి వెళ్లాడట.