ఆయన అగ్రరాజ్యానికే అధ్యక్షుడు. అమెరికాలో ఉంటేనే ఆయనకో స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమానం అది. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉండే ఆ విమానంలో సౌకర్యాలను చూస్తే కళ్లు తిరిగిపోతాయి. హంగూ, ఆర్భాటాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అక్కడే అలా ఉంటే..ఇక విదేశీ పర్యటన అంటే మామూలు విషయం కాదు. మందీ మార్బలం, భద్రత, రాజభోగాలు..ఇలా ఏ అంశంలోనూ లోటుండదు. విమానం, కారు, హెలికాఫ్టర్ అన్నీ ప్రత్యేకతలే. వైట్‌హౌస్‌లో ఎలా ఉంటారో ఆయన పర్యటనలో కూడా అన్ని రాజభోగాలుంటాయి. కట్టుదిట్టమైన భద్రతతో పాటు విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి.
ఈ నెల 24న రెండ్రోజుల పర్యటన కోసం భారత్‌కు వస్తున్నారు ట్రంప్. సతీమణి మెలనియా ట్రంప్‌తో కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో అహ్మాదాబాద్‌లో ల్యాండవుతారు మిస్టర్ ప్రెసిడెంట్. ట్రంప్ ప్రయాణించే విమానం బోయింగ్ 747-200. ఆ విమానాన్ని ఎగిరే వైట్‌హౌస్‌గా చెప్పుకోవలసిందే. ఈ విమానంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న అక్షరాలు, అమెరికా జాతీయజెండా ఉంటాయి.
మూడు అంతస్తులుంటే ఈ విమానం లోపల విస్తీర్ణం 4వేల చదరపు అడుగులు ఉంటుంది. అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, లేటెస్ట్ టెక్నాలజీ వ్యవస్థ, వంద మందికి వంట చేసేలా కిచెన్, సిబ్బందికి లాంజ్‌తో పాటు సకల సౌకర్యాలు ఉంటాయి. అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, 24 గంటలపాటు డాక్టర్ అందుబాటులో ఉంటాడు. నాలుగు జెట్ ఇంజిన్స్‌తో నడిచే ఈ విమానం..గంటకు వెయ్యి కిలోమీటర్ల కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. 70 మంది వరకు ఈ విమానంలో ప్రయాణించవచ్చు. అంతేకాదు. ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. ఏదైనా దాడి జరిగే అవకాశముందని తెలిస్తే చాలు. మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారిపోతుంది. అలాగే గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఉండటంతో..ఎంతసేపైనా నింగిలో ప్రయాణించగలదు.
ట్రంప్ కారు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యాడిలాక్ తయారుచేసే ద బీస్ట్..ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఏర్పాట్లున్న కారు. ట్రంప్ కాన్వాయ్‌లో 12 ద బీస్ట్ కార్లుంటాయి. 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారైన ఈ కారు ఎలాంటి బాంబ్ పేలుళ్లనైనా తట్టుకుంటుంది. అత్యంత విలాసవంతమైనది. భద్రతాపరంగా శత్రుదుర్బేధ్యంగా ఉంటుంది. ఇక కారు టైర్లు ఎట్టి పరిస్థితుల్లో పంక్చర్ అవకుండా ఉండేలా ఉక్కు కలిపి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టైర్ పేలినప్పటికీ రిమ్తోనూ కారు నడవగలుగుతుంది. బోయింగ్ 757 విమానానికుండే డోర్లు ద బీస్ట్ కారుకు ఉంటాయి. వాటిలో ఆయుధాలు అమర్చి ఉంటాయి. దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. అవసరమైతే గుళ్ల వర్షాన్ని కురిపిస్తాయి. గ్యాస్, రసాయనాల వంటివి కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలా ఏర్పాటుచేశారు.
ఇక డ్రైవర్..సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మాత్రమే ఉంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కారును నడిపేలా శిక్షణ ఇస్తారు. ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలోనూ తిరగగలదు ఈ కారు. డ్రైవర్ కంపార్ట్‌మెంట్‌లో ఉండే జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ..సమాచార కేంద్రానికి అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలందిస్తుంది. అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తం, ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇక డీజిల్ ట్యాంక్ ఏ పరిస్థితుల్లోనూ పేలకుండా ఉండేలా ప్రత్యేకమైన రక్షణ కవచం ఉంటుంది. అధ్యక్షుని సీటు వద్దే శాటిలైట్ ఫోన్, అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. ఒబామా హయాం నుంచి ఈ కారును వాడుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక విమానంలో భద్రతా సిబ్బంది సహా అధ్యక్షుడు ప్రయాణించే కారు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుంది.
అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా మెరైన్ వన్ హెలికాఫ్టర్ కూడా వెంట వస్తుంది. ఆయా దేశాల్లో చిన్న చిన్న దూరాలకు, తాను బస చేసే హోటల్‌కి వెళ్లడానికి ఈ హెలికాప్టర్‌ని వినియోగిస్తారు ట్రంప్. వీహెచ్-3డీ సీ కింగ్ లేదా వీహెచ్ 60 ఎన్ వైట్ హాక్ హెలికాఫ్టర్లనే అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. ఇవి క్షిపణి దాడుల్ని సైతం తట్టుకుంటాయి. మొత్తం 5 హెలికాఫ్టర్లలో ఒక దాంట్లో ట్రంప్..మిగిలిన నాలుగు అధ్యక్షునికి రక్షణగా ఉంటాయి. హెలికాఫ్టర్‌లో ఉన్న అత్యాధునిక సమాచార వ్యవస్థతో మెరైన్ వన్ ఎటు వెళ్తుందో..ఆ 5 హెలికాఫ్టర్లు సమాచారం అందించుకుంటాయి.