ప్రపంచం రెండు యుద్ధాలను ఎదుర్కొంది. ఎన్నో అనుభవాలను.. చేదు జ్ఞాపకాలను చరిత్ర పుటల్లో లిఖించుకుంది. అలంటి యుద్ధాల్లో జరిగిన సంఘటనలు నేటికీ జ్ఞప్తికి తెచ్చుకునే వారున్నారు కూడా.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగి.. చరిత్ర పేజీల్లో నిలిచిన ఒక సంఘటన తాలూకా జ్ఞాపకాన్ని ఈ రోజు మళ్ళీ గుర్తు చేసుకుందాం.. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పోలెండ్ సైనికులు ఇరాన్ గుండా పాలస్తీనా వైపు కవాతు చేస్తున్నారు. అప్పుడు ఒక సైనికుడి ద్రుష్టి పిల్లవాడి ఒడిలో ఉన్న ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల మీద పడింది. ఎలుగుబంటి తల్లిని వేటగాడు బంధించి ఉండవచ్చని భావించిన సైనికులు ఎలుగుబంటి పిల్లను తమతో పాటు తీసుకెళ్లారు. సైనికులు ఆ ఎలుగుబంటి పిల్లకు వోజ్టెక్ అనే పేరు పెట్టారు. యుద్ధ సమయంలో సాధారణ సైనికుడిలా సైనికులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళేది. అంతేకాదు ఎలుగుబంటికి సొంత పే పుస్తకం, రేషన్, ర్యాంక్ కూడా ఉన్నాయి.
వోజ్టెక్ 22వ ఆర్టిలరీ సప్లై కంపెనీలో అంతర్భాగంగా పని చేసింది. యుద్ధ సమయంలో మందుగుండు పెట్టెలను ఎత్తే పని కూడా చేసింది. తాను చేసిన సేవల కారణంగా వోజ్టెక్ కార్పోరల్ ర్యాంక్ పొందింది. అప్పటి వరకూ యుద్ధంలో సైనికుడి హోదా పొందిన జంతువు చరిత్రలో అరుదుగా అని చెప్పవచ్చు. ప్రత్యేకమైన వోజ్టెక్ (Vojtek) ఎలుగుబంటి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఈ రోజు తెలుసుకుందాం.
వోజ్టెక్ ఒక భారీ ఎలుగుబంటి. సుమారు ఆరు అడుగుల పొడవు.. 200 కిలోగ్రాముల బరువు ఉండేది. దీని భారీ శరీర పరిమాణం దృష్ట్యా దీనికి ఇతర సైనికుల కంటే ఎక్కువ ఆహారాన్ని అందించేవారు. అయితే తమకంటే ఎలుగుబంటి ఎక్కువ ఆహారం ఇస్తున్నారని ఏ సైనికుడు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎలుగుబంటి తన తోటి సైన్యంతో ఎంతో స్నేహంగా మెలిగింది. వారితో కలిసి ఆహారం తిని వారితో డేరాలో పడుకునేది. ఆ పిల్ల పెద్ద పెద్దయ్యాక.. నిద్ర పోవడానికి ఒక పెద్ద చెక్క పెట్టె ఇచ్చారు. అయితే దానికి తనకు ఇచ్చిన చెక్కపెట్టెలో ఒంటరిగా నిదురించడం ఇష్టం లేదు. దీంతో తరచుగా రాత్రి సమయంలో సైనికులతో కలిసి ఒక డేరాలో నిద్రించడానికి వెళ్ళేది.
ఈ వోజ్టెక్ కు ప్రజలంటే భయం లేదు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేది. 22వ ఆర్టిలరీ సప్లై కంపెనీలో విధులను నిర్వహించిన వోజ్సీచ్ నరేబ్స్కీ BBCతో మాట్లాడుతూ వోజ్టెక్ తాము పని చేస్తున్నప్పుడు, సహాయానికి వచ్చి అక్కడ ఉన్న వస్తువులను తీసుకుని ట్రక్ దగ్గరకు వెళ్ళేవాడిని గుర్తు చేసుకున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 22వ ఆర్టిలరీ సప్లై కంపెనీతో పని వోజ్టెక్ ఎలుగుబంటి చేస్తున్నప్పుడు అనేక దేశాల్లో ప్రయాణించాడు. ఇరాక్, సిరియా, పాలస్తీనా, ఈజిప్ట్, ఇటలీ , స్కాట్లాండ్ దేశాలకు సైన్యంతో కలిసి వోజ్టెక్ ఎలుగుబంటి ప్రయాణించింది. వోజ్టెక్ చాలా ప్రశాంతంగా ఉండేదని తోటి సైనికులు చెప్పారు.
అంతేకాదు వోజ్టెక్ ఎలుగుబంటి పేరు మీద పే బుక్ కూడా ఉంది. దానికి డబ్బు చెల్లించలేదు.. అయినప్పటికీ అధికారికంగా పోలాండ్ సైనికుడు. కంపెనీ ఇటలీకి రవాణా చేయబడినప్పుడు.. వోజ్టెక్ ఎలుగుబంటి అధికారికంగా సైనికుడిగా నమోదు చేయబడింది.
1/ I’d like to tell you an #WW2 story close to my family’s heart. That of an incredible bear that was adopted by Polish soldiers in the Middle East and accompanied them during the war through Italy.
His name was Wojtek.THREADhttps://t.co/UD3eBtskVE pic.twitter.com/q6Ndg204SL
— Janek Lasocki (@JanekLasocki) May 10, 2020
ఈ సమయంలో ఇది సైనికుల మనోధైర్యాన్ని పెంచే సాధనంగా ఉండేది. వోజ్‌టెక్‌కు సైనికులతో ఆడుకోవడం చాలా ఇష్టం. సరదాగా కుస్తీ కూడా పట్టేది. ప్రత్యర్థి ఓడిపోయినప్పుడు క్షమాపణ కోసం ముఖం చాటేసేది అంటూ అప్పటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. నివేదిక ప్రకారం వోజ్టెక్ సైనికులను సిగరెట్లను అడిగేది. వాటిని హ్యాపీగా కాల్చేది కూడా.. అంతేకాదు వోజ్‌టెక్‌కి కూడా బీర్ అంటే చాలా ఇష్టం. అయితే మద్యానికి బానిసగా మాత్రం కాలేదని వివరించారు.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, వోజ్‌టెక్‌ని ఎడిన్‌బర్గ్ జూ (స్కాట్లాండ్)కి పంపారు. అయితే, మనుషులతో చాలా సమయం గడిపిన వోజ్టెక్ జూ వాతావరణంలో ఇమడలేకపోయింది. అక్కడ సంతోషంగా లేదు. తన జాతికి చెందిన ఇతర ఎలుగుబంట్ల మధ్య జీవించడం కూడా సౌకర్యంగా ఫీల్ కాలేదు. వోజ్టెక్ 21 సంవత్సరాల వయస్సులో 1963 లో మరణించింది. వోజ్టెక్ మరణించే వరకు 16 సంవత్సరాల పాటు స్కాట్లాండ్ జూలో గడిపింది.
ఎలుగుబంటి దైర్యం చాలా మందిని ఆకట్టుకుంటుంది. లండన్‌లోని సికోర్స్కీ మ్యూజియంలో ఎలుగుబంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్కాట్లాండ్, పోలాండ్‌లో వోజ్‌టెక్ విగ్రహాలు కూడా ఉన్నాయి. వోజ్‌టెక్ గౌరవార్థం ఒక ఎలుగుబంటి తన పాదాలలో ఫిరంగి బంతిని పట్టుకున్నట్లు వర్ణించే అధికారిక బ్యాడ్జ్ ప్రవేశపెట్టారు. 2011లో వోజ్టెక్ పై ఓ డాక్యుమెంటరీ తీశారు. దాని పేరు ‘వోజ్టెక్ – ది బేర్ దట్ వాంటెడ్ టు వార్.’ ఇది UKలో ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. వోజ్‌టెక్ కథ గురించి చిత్ర దర్శకుడు విల్ హుడ్ మాట్లాడుతూ, ‘ఇది యుద్ధ కథ, ప్రేమ కథ, నష్టానికి సంబంధించిన కథ అని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..