ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి టాప్ ఐటీ కంపెనీల సస్పెన్షన్

అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న నెపంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలపై వేటు వేసింది. గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో అత్యంత కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఈ సంస్థలను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి టాప్ ఐటీ కంపెనీల సస్పెన్షన్
Us Suspends Permanent Labour Approvals For Major It Firms
Image Credit source: AI Image

Updated on: Oct 08, 2026 | 11:16 PM

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ అవుట్‌సోర్సింగ్ దిగ్గజాలను సస్పెండ్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారన్న ఆరోపణలతో ఈ కఠిన చర్యలు చేపట్టింది. యూఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సాండర్లింగ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యాంటీ-ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్‌లతో కలిసి ఈ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు.

సస్పెండైన ప్రముఖ సంస్థలు

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ సంస్థలను సస్పెండైన లిస్ట్‌లో ఉన్నాయి. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇకపై ఈ సంస్థల నుంచి కొత్త పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను స్వీకరించబోమని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తిగా నిలిపివేస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2009 నుంచి ఈ కంపెనీలు దాదాపు 30 లక్షల మంది విదేశీ వర్కర్ల కోసం రిక్వెస్ట్‌లు పెట్టాయని, 2.30 లక్షలకు పైగా హెచ్-1బీ వీసాలు, లక్షకు పైగా శాశ్వత లేబర్ సర్టిఫికేషన్లు పొందాయని లేబర్ సెక్రటరీ తెలిపారు. వీరి నియామక విధానాల వల్ల లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు.

మైక్రోసాఫ్ట్‌పై జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం

ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. స్థానిక అర్హులైన నిపుణులు దొరకడం లేదంటూ 2025లో మైక్రోసాఫ్ట్ 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని వాన్స్ గుర్తుచేశారు. కానీ అదే సమయంలో ఆ సంస్థ 6,000 కంటే ఎక్కువ హెచ్-1బీ వీసా అనుమతులు పొందిందని, 3,682 పర్మ్ దరఖాస్తులు చేసిందని మండిపడ్డారు. అందులో దాదాపు 1,000 పోస్టులు గతంలో తొలగించిన అమెరికన్ ఉద్యోగుల పొజిషన్లేనని ధ్వజమెత్తారు. హెచ్-1బీ ద్వారా వచ్చే వారిని విదేశీ బానిసలుగా వాడుకుంటున్నారని, ఇలాంటి సంస్థలు వీసా మిల్లులుగా మారిపోయాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ ప్రకటనలను పరిమితంగా ఇచ్చి, స్థానికులు దొరకలేదనే నెపంతో విదేశీయులను నియమించుకుంటున్నారని ఆరోపించారు.

యూనివర్సిటీల్లోని జే-1 వీసాలపై కూడా విమర్శలు

అమెరికన్ రీసెర్చ్ స్కాలర్ల వేతనాలను తగ్గించేందుకు విశ్వవిద్యాలయాలు జే-1 వీసాలను విచ్చలవిడిగా వాడుకుంటున్నాయని వాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక నిపుణుల జీతభత్యాలను తగ్గించకుండా నైపుణ్యం ఉన్న ప్రతిభను మాత్రమే అమెరికాకు ఆహ్వానించాలన్నదే తమ విధానమని తేల్చిచెప్పారు.

భారత ఐటీ నిపుణులపై పెను ప్రభావం

ట్రంప్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమెరికాలో గ్రీన్ కార్డ్ ఆశిస్తున్న వేలాది మంది భారతీయ టెక్ ప్రొఫెషనల్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఎంప్లాయర్ స్పాన్సర్డ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌లో పర్మ్ తొలి మెట్టు. ఇప్పుడు దానిపైనే నిషేధం పడటంతో భారత దిగ్గజ కంపెనీలలో పనిచేస్తూ అమెరికాలో స్థిరపడాలనుకునే నిపుణులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us