UN Warning: భూమికి పొంచి ఉన్న పెను ముప్పు.. 2.6 డిగ్రీల సెల్సియస్ వేడెక్కనున్న ప్రపంచం!

గ్లోబల్ వార్మింగ్ నియంత్రణపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) విడుదల చేసిన 'ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్' సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రపంచ దేశాలు చేస్తున్న వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని.. చేతల్లో మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని యూఎన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ శతాబ్దాంతానికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

UN Warning: భూమికి పొంచి ఉన్న పెను ముప్పు.. 2.6 డిగ్రీల సెల్సియస్ వేడెక్కనున్న ప్రపంచం!
Un Warning

Updated on: Nov 18, 2026 | 5:59 PM

గ్లోబల్ వార్మింగ్ నియంత్రణపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) విడుదల చేసిన ‘ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్’ సంచలన విషయాలను బయటపెట్టింది. ప్రపంచ దేశాలు చేస్తున్న వాగ్దానాలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని.. చేతల్లో మాత్రం ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదని యూఎన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పారిస్ వాతావరణ ఒప్పంద లక్ష్యాలకు విరుద్ధంగా భూమి వేడెక్కుతోందని స్పష్టం చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ శతాబ్దాంతానికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 2.6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతున్న ‘కాప్-31’ (COP31) వాతావరణ సదస్సులో ఈ విషయాలను స్పష్టం చేసింది.

చేజారిపోయిన 1.5 డిగ్రీల ఆశ..

భూమిని కాపాడుకోవడానికి పారిస్ ఒప్పందంలో పెట్టుకున్న 1.5 డిగ్రీల పరిమితి అనే ఆశ ఇక ఆవిరైపోయింది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ప్రదర్శించిన ఉదాసీనత వల్ల ఆ సురక్షిత గీతను మనం దాటేయక తప్పదని యూఎన్ఈపీ నివేదిక బయటపెట్టింది. ఈ నివేదికను విడుదల చేస్తూ ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. “1.5 డిగ్రీల పరిమితిని దాటకుండా ఇక మనం తప్పించుకోలేమని.. దాని భయంకరమైన ఫలితాలను ఇప్పటికే కళ్లారా చూస్తున్నామని వాపోయారు. ఊళ్లకు ఊళ్లను వరదలు ముంచెత్తుతున్నాయని.. కార్చిచ్చులు అడవులను బూడిద చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇందుకు ఏమాత్రం కారణం కాని పేద దేశాలలోని అమాయక ప్రజలే అందరికంటే ముందుగా బలవుతున్నారని ఎమోషనల్ అయ్యారు.

అగ్రరాజ్యాల వల్లే..

కాగా భూమిని వేడెక్కిస్తున్న కాలుష్యంలో 75 శాతం వాటా కేవలం 20 సంపన్న దేశాలదే (G20) అంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకవైపు భారత్, రష్యా, యూరప్ దేశాలు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే.. అగ్రరాజ్యం అమెరికా మాత్రం స్వార్థపూరితంగా వ్యవహరిస్తోందని నివేదిక ఎత్తిచూపింది. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడమే కాకుండా, బొగ్గు, చమురు వాడకాన్ని విపరీతంగా పెంచుతూ అమెరికా భూమికి మరింత నిప్పు పెడుతోందని రివీల్ చేసింది. ప్రకృతి ప్రకోపానికి అమెరికా అయినా, మరే దేశమైనా తలవంచాల్సిందేనని.. ఈ విపత్తు నుంచి ఎవరూ తప్పించుకోలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఈ విషయంపై పర్యావరణవేత్త మహమ్మద్ అడోవ్ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “ఇది రాజకీయ నాయకత్వపు చారిత్రక వైఫల్యం. శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా గొంతు చించుకుని చెబుతున్నా పాలకులు కళ్లు తెరవలేదు. ఈ నిర్లక్ష్యానికి మనం చెల్లించే మూల్యాన్ని పెరిగే ఉష్ణోగ్రతల డిగ్రీలలో కాదు.. గాలిలో కలిసిపోయే అమాయకుల ప్రాణాలతో కొలవాల్సి వస్తుంది” అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రపంచ నాయకులు స్వార్థం వీడి, భవిష్యత్ తరాలకు ఊపిరి పోసే నిర్ణయాలు తీసుకోకపోతే.. చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదని తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us