మదీనాలో భారీ ఖనిజ నిక్షేపాలు.. యురేనియం, అరుదైన భూలోహాల ఆవిష్కరణ!

మదీనాలో 110 మిలియన్ టన్నుల యురేనియం, అరుదైన భూలోహాల నిక్షేపాలు సౌదీ అరేబియాకు కొత్త శకానికి నాంది పలికాయి. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి, అణుశక్తి, ఖనిజ రంగాల్లో సౌదీ 'విజన్ 2030' లక్ష్యాలను ఈ ఆవిష్కరణ బలోపేతం చేస్తుంది. ఇంధన భవిష్యత్తును వైవిధ్యపరచడంలో ఇది కీలక అడుగు, సౌదీని అణు, ఖనిజ శక్తిగా మార్చే దిశగా ముందుకు తీసుకెళ్తుంది.

మదీనాలో భారీ ఖనిజ నిక్షేపాలు.. యురేనియం, అరుదైన భూలోహాల ఆవిష్కరణ!
Uranium Ore In Saudi Arabia
Image Credit source: AI Image

Updated on: Sep 14, 2026 | 10:14 PM

రియాద్: ప్రపంచానికి చమురు దిగ్గజంగా పేరున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు తన ఇంధన భవిష్యత్‌ను మరో దిశగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో కీలక ముందడుగు వేసింది. మదీనా ప్రాంతంలోని జబల్ సయీద్ ప్రాజెక్టులో సుమారు 110 మిలియన్ టన్నుల ఖనిజ ధాతువు ఉన్నట్లు అన్వేషణ, భూగర్భ అధ్యయనాల్లో గుర్తించినట్లు సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ వెల్లడించారు. ఈ ఖనిజంలో అరుదైన భూలోహాలు, ముఖ్యంగా హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అధిక సాంద్రతతో పాటు ఆశాజనకమైన యురేనియం నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

అయితే 110 మిలియన్ టన్నులు అనేది యురేనియం, అరుదైన భూలోహాలు తదితర పదార్థాలు కలిగిన మొత్తం ఖనిజ ధాతువు పరిమాణం. అందులో వాస్తవంగా ఎంత యురేనియం ఉందో, దాన్ని వాణిజ్యపరంగా ఎంత మేర వెలికితీయగలమో తదుపరి అధ్యయనాలు, అంచనాల ద్వారా స్పష్టమయ్యే అవకాశం ఉంది.

యురేనియంపై సౌదీ ప్రత్యేక దృష్టి

సౌదీ అరేబియా కొంతకాలంగా చమురుపై ఉన్న ఆధారాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థను విస్తరించేందుకు విజన్ 2030 కింద భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో ఇంధనం, గనులు, అరుదైన ఖనిజాలు, పునరుత్పాదక శక్తితో పాటు అణుశక్తికి కూడా ప్రాధాన్యం ఇస్తోంది. సౌదీ నేషనల్ అటామిక్ ఎనర్జీ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోని యురేనియం వనరులను అన్వేషించి, వాటిని ఆర్థికంగా ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఇంధన మంత్రి తెలిపారు. ఎరువుల తయారీ ప్రక్రియలో లభించే అనుబంధ యురేనియంను కూడా వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

మదీనాలో తాజాగా గుర్తించిన ఖనిజ వనరులు ఈ ప్రణాళికలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతికత, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, పారిశ్రామిక రంగం వంటి అనేక కీలక రంగాలకు అవసరం కావడంతో వీటి ప్రాధాన్యం అంతర్జాతీయంగా పెరుగుతోంది.

అమెరికాతో అణు ఒప్పందం తర్వాత ఈ ప్రకటన

సౌదీ యురేనియం అన్వేషణ ప్రకటన వెలువడిన సమయం అంతర్జాతీయంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. 2026 జూలైలో అమెరికా, సౌదీ అరేబియా శాంతియుత అణుశక్తి సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. అమెరికా ఇంధన శాఖ దీనిని దశాబ్దాల పాటు కొనసాగే, బహుళ బిలియన్ డాలర్ల భాగస్వామ్యానికి పునాది వేసే ఒప్పందంగా పేర్కొంది. అమెరికా కంపెనీలకు సౌదీ అణుశక్తి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కల్పించేలా ఈ ఒప్పందం రూపొందింది.

ఈ ఒప్పందంలో సౌదీకి అణు ఇంధనాన్ని తయారు చేసుకునే సామర్థ్యంపై చర్చ జరగడం అంతర్జాతీయంగా ఆందోళనలకు కారణమైంది. యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్రక్రియ పౌర అణుశక్తికి అవసరమైనప్పటికీ, అదే సాంకేతిక సామర్థ్యాన్ని అధిక స్థాయిలో ఉపయోగిస్తే అణ్వస్త్రాల తయారీకి దారి తీసే అవకాశం ఉండటంతో అణు వ్యాప్తి నిరోధక నిపుణులు దీనిపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.

అయితే సౌదీ మాత్రం తన అణు కార్యక్రమం శాంతియుత అవసరాల కోసమేనని, అంతర్జాతీయ ప్రమాణాలు, పారదర్శకత, అణు భద్రతా నిబంధనలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నామని చెబుతోంది. ఇంధన మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ సౌదీ అణు కార్యక్రమం అంతర్జాతీయ సమాజానికి దూరంగా, రహస్యంగా కొనసాగడం లేదని స్పష్టం చేశారు.

ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాధాన్యం

మధ్యప్రాచ్యంలో అణు అంశం ఎప్పటినుంచో అత్యంత సున్నితమైన అంశం. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్‌తో తీవ్ర విభేదాలు కొనసాగుతున్న సమయంలో సౌదీ కూడా స్వదేశీ అణుశక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ప్రాంతీయ వ్యూహాత్మక సమీకరణాలకు ప్రాధాన్యం కల్పిస్తోంది. సౌదీ అరేబియా సున్నీ ప్రపంచంలో కీలక శక్తికేంద్రం కాగా, ఇరాన్ షియా ఆధిపత్య దేశంగా ఉంది. ఇరుదేశాల మధ్య గతంలో తీవ్ర ప్రాంతీయ పోటీ ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, సముద్ర మార్గాలపై ముప్పులు, ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సౌదీ తన ఇంధన భద్రతను మరింత విస్తృతంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చమురు దేశం నుంచి అణుశక్తి వైపు?

సౌదీ అరేబియాకు చమురు ఇప్పటికీ ప్రధాన ఆర్థిక వనరు. కానీ భవిష్యత్తులో ప్రపంచ ఇంధన అవసరాలు మారే అవకాశం ఉన్నందున సౌదీ చమురు + గ్యాస్ + సౌరశక్తి + అణుశక్తి + ఖనిజ వనరులు కలిసిన విస్తృత ఇంధన వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. సౌదీ ఇంధన మంత్రి తాజాగా అణుశక్తిని దేశ జాతీయ ఇంధన మిశ్రమంలో భాగం చేయడం అవసరమని పేర్కొన్నారు. అదే సమయంలో దేశంలోని విస్తారమైన ఖనిజ వనరులను గుర్తించి, అరుదైన భూలోహాల సరఫరా గొలుసుల్లో సౌదీ పాత్రను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

IAEAతో సౌదీ సహకారం

ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA కూడా సౌదీ అణు కార్యక్రమాన్ని గమనిస్తోంది. IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ సెప్టెంబర్ 14న సౌదీ అణుశక్తి కార్యక్రమం, పరిశోధనా రియాక్టర్ ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, అణు వ్యాప్తి నిరోధక అంశాలపై సౌదీ నిబద్ధతను స్వాగతిస్తున్నామని తెలిపారు. సౌదీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేస్తోందని పేర్కొంది.

మదీనాలో బయటపడిన నిధి.. సౌదీకి కొత్త అధ్యాయం?

ఇప్పటివరకు సౌదీ అరేబియా అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది ప్రధానంగా చమురు. కానీ మదీనా ప్రాంతంలో గుర్తించిన 110 మిలియన్ టన్నుల ఖనిజ ధాతువు, అందులోని అరుదైన భూలోహాలు, యురేనియం సాంద్రతలు.. సౌదీ భవిష్యత్ వ్యూహంలో ఖనిజ రంగం ఎంత కీలకంగా మారుతోందో చూపిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఖనిజ ఆవిష్కరణగా కాకుండా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి బహుముఖ ఇంధన, ఖనిజ శక్తిగా మారాలనే సౌదీ ప్రయత్నాల్లో మరో కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. అయితే ఈ ఖనిజ ధాతువులో వాస్తవంగా ఎంత యురేనియం ఉంది? దాన్ని ఎంత మేర వాణిజ్యపరంగా వెలికితీయవచ్చు? సౌదీ తన పౌర అణు విద్యుత్ కార్యక్రమంలో ఈ వనరులను ఎలా ఉపయోగించనుంది? అన్నది రాబోయే అధ్యయనాలు, ప్రాజెక్టుల పురోగతిపై ఆధారపడి ఉంటుంది.

ఒకవైపు అమెరికాతో అణు సహకారం.. మరోవైపు దేశీయ యురేనియం అన్వేషణ.. ఇంకోవైపు అరుదైన భూలోహాలపై దృష్టి. ఈ మూడు పరిణామాలు కలిసి చూస్తే, సౌదీ అరేబియా తన “చమురు రాజ్యం” అనే గుర్తింపును దాటి భవిష్యత్తులో అణు, ఖనిజ, అధునాతన ఇంధన శక్తిగా ఎదగాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us