
ప్రపంచ దేశాల అధినేతలంతా ఒకే వేదికపైకి వస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెంట కనిపించిన ఓ నల్లటి బ్రీఫ్‌కేస్ ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. చైనాలోని షెన్‌జెన్‌లో జరుగుతున్న ఏపెక్ (APEC) సదస్సుకు హాజరైన పుతిన్ వెంట రష్యా నావికాదళ అధికారులు ఈ ప్రత్యేకమైన బ్రీఫ్‌కేస్‌ను తీసుకెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది సాధారణ బ్యాగ్ కాదని, రష్యా అణ్వాయుధాల కమాండ్ వ్యవస్థలో కీలకమైన ‘చెగెట్’ (Cheget) న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్ అని రష్యా అధికారి ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో పుతిన్ సమావేశం కానున్న సమయంలో ఈ బ్రీఫ్‌కేస్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా అణ్వాయుధాల నియంత్రణ, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
అసలు ఈ చెగెట్ అంటే ఏమిటి?
పుతిన్ వెంట కనిపించిన ఈ బ్రీఫ్‌కేస్‌ను ‘చెగెట్’ అని పిలుస్తారు. ఇది రష్యా అణు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలో భాగం. దేశ అధ్యక్షుడికి అత్యంత కీలకమైన సైనిక నాయకత్వంతో సురక్షితంగా సంప్రదింపులు జరిపేందుకు, అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన అధికారిక ఆదేశాలను పంపేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, ఈ బ్రీఫ్‌కేస్‌లో ఓ బటన్ నొక్కగానే అణు క్షిపణులు ప్రయోగిస్తారని కాదు..! ఇది స్వయంగా క్షిపణులను ప్రయోగించే పరికరం కాదు. అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన నిర్ణయాలు, అనుమతులు, సైనిక కమాండ్ మధ్య సమాచార ప్రసారంలో కీలక పాత్ర పోషించే వ్యవస్థ. అమెరికాలో అధ్యక్షుడి వెంట ఉండే ‘న్యూక్లియర్ ఫుట్‌బాల్’కు ఇది కొంతవరకు సమానమైన వ్యవస్థ.
బ్రీఫ్‌కేస్‌లో ఏముంటుంది?
ఈ న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్‌లోని పూర్తి వివరాలను రష్యా ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించలేదు. అయితే 2019లో రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జ్వెజ్డా (Zvezda) టెలివిజన్ పాత నమూనాను ప్రజలకు చూపించింది. ఆ ప్రదర్శనలో బ్రీఫ్‌కేస్‌లో తెలుపు రంగు ‘లాంచ్’ బటన్, ఎరుపు రంగు ‘క్యాన్సిల్’ బటన్ ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా కొన్ని నియంత్రణలు, సమాచార ప్రసార వ్యవస్థలు కూడా ఉన్నాయి. సైనిక సమాచార వ్యవస్థకు అనుసంధానమైన ఈ పరికరం ద్వారా రష్యా అధ్యక్షుడు కీలక సైనిక అధికారులతో సంప్రదింపులు జరపగలరు. అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన ఆదేశాలను అధికారిక కమాండ్ వ్యవస్థకు పంపగలరు.
చెగెట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?
రష్యాలోని కాకసస్ పర్వత శ్రేణుల్లో ఉన్న ‘చెగెట్’ పర్వతం పేరు మీద ఈ బ్రీఫ్‌కేస్‌కు ఆ పేరు పెట్టారు. దీని రూపకల్పన సోవియట్ యూనియన్ కాలంలోనే ప్రారంభమైంది. 1980లలో ఈ వ్యవస్థను అభివృద్ధి చేసి, మిఖాయిల్ గోర్బచేవ్ అధికారంలోకి వచ్చిన 1985లో అధికారికంగా వినియోగంలోకి తీసుకొచ్చినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత కూడా ఈ వ్యవస్థ రష్యా అణు కమాండ్ వ్యవస్థలో కొనసాగింది. 1999 డిసెంబర్‌లో బోరిస్ యెల్టిసన్ నుంచి వ్లాదిమిర్ పుతిన్‌కు అధ్యక్ష బాధ్యతలు బదిలీ అయినప్పుడు అణు కమాండ్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.
చెగెట్‌ను ఎప్పుడైనా ఉపయోగించారా?
ఈ బ్రీఫ్‌కేస్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘటన 1995 జనవరి 25న జరిగింది. అప్పట్లో రష్యా అధ్యక్షుడిగా బోరిస్ యెల్టిసన్ ఉన్నారు. నార్వే, అమెరికా శాస్త్రవేత్తలు ‘బ్లాక్ బ్రాంట్’ (Black Brant) అనే పరిశోధనా రాకెట్‌ను ప్రయోగించారు. అయితే రష్యా రాడార్ వ్యవస్థ దానిని శత్రు దేశం నుంచి వస్తున్న బాలిస్టిక్ క్షిపణిగా పొరబడింది. దీంతో రష్యా సైనిక వ్యవస్థలో అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ పరిణామంతో అధ్యక్షుడు యెల్టిసన్‌కు అణు కమాండ్ వ్యవస్థను ఉపయోగించే పరిస్థితి ఏర్పడింది. చెగెట్ బ్రీఫ్‌కేస్‌ను యాక్టివేట్ చేసి పరిస్థితిని పరిశీలించారు. చివరకు అది పరిశోధనా రాకెట్ మాత్రమేనని గుర్తించడంతో అణు దాడి ప్రమాదం తప్పింది. ఈ ఘటనను రష్యా అణు చరిత్రలో అత్యంత కీలకమైన సంఘటనగా పరిగణిస్తారు.
ట్రంప్, జిన్‌పింగ్ సమావేశాల వేళ ఎందుకింత ప్రాధాన్యం?
ప్రస్తుతం పుతిన్ వెంట చెగెట్ బ్రీఫ్‌కేస్ కనిపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. షెన్‌జెన్‌లో ఏపెక్ సదస్సు సందర్భంగా ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్‌లు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. అణ్వాయుధ నియంత్రణ కూడా ఈ చర్చల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పుతిన్ వెంట న్యూక్లియర్ బ్రీఫ్‌కేస్ ఉండటం అణుదాడికి సిద్ధమవుతున్నారనే అర్థం కాదు. విదేశీ పర్యటనల్లోనూ అధ్యక్షుడి అణు కమాండ్ వ్యవస్థను అందుబాటులో ఉంచడం భద్రతా విధానంలో భాగం.
మొత్తానికి ఓ సాధారణ నల్లటి బ్రీఫ్‌కేస్‌లా కనిపించే చెగెట్ వెనుక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు కమాండ్ వ్యవస్థల్లో ఒకటి ఉంది. అందుకే పుతిన్ వెంట అది కనిపించడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..