
భారత్ – అమెరికా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ – ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత 16 నెలల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ఇదే తొలిసారి. భారత్ – అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో భారత్, అమెరికా మధ్య సంబంధాలను రీసెట్ చేయడంపైనే ఇరు నేతలు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “మిస్టర్ ప్రెసిడెంట్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గత ఏడాది వాషింగ్టన్‌లో మనం కలుసుకున్నప్పటి నుండి మన దేశాల బంధంలో సరికొత్త వేగం, సరికొత్త శక్తి వచ్చాయి. మన రెండు బృందాలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మేము వేగంగా ప్రయత్నాలు చేస్తున్నాము” అని ఆనందం వ్యక్తం చేశారు.
ఇరుదేశాల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వాణిజ్య వివాదాలకు త్వరలోనే తెరపడనుందని ఈ భేటీ ద్వారా స్పష్టమైంది. భారత్-అమెరికా మధ్య త్వరలోనే ఒక భారీ ట్రేడ్ డీల్ కుదరబోతుందని ఇరుపక్షాలు వెల్లడించాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందిస్తూ.. ‘‘భారతదేశంలో మేము భారీగా పెట్టుబడులు పెడుతున్నాం. ప్రధాని మోదీ మాకు అత్యంత ఆప్తమిత్రుడు. అమెరికా ఎల్లప్పుడూ భారత్‌కు అండగా ఉంటుంది” అని చెప్పారు.
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ అభినందించారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికుల్లో దాదాపు 10 శాతం మంది భారతీయులే ఉన్నారని గుర్తు చేస్తూ, వారి భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడం ప్రపంచ వాణిజ్యానికి ఎంతో మేలు చేస్తుందని మోదీ స్పష్టం చేశారు. హర్మూజ్ ప్రాంతం వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని, అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛగా సాగాలని ఆయన నొక్కి చెప్పారు.