
న్యూయార్క్ నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం షాక్‌కు గురి చేస్తోంది. రన్‌వేపై ప్రయాణానికి సిద్ధమవుతున్న ఓ విమానాన్ని… అగ్నిమాపక వాహనం వెళ్లి ఢీకొనడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇంకా అధికారులు ధృవీకరించలేదు. పలువురు తీవ్రంగా గాయడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫైరింజన్ ఢీకొన్న తాకిడికి విమానం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ఘటనపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ, ప్రమాదాల పరిశీలనా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రమాదానికి సంబంధించిన కీలక శబ్ద రికార్డు కూడా బయటకు వచ్చింది. విమాన రాకపోకల నియంత్రణ కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ, అగ్నిమాపక వాహనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆగమని పలుమార్లు హెచ్చరించినా వాహనం నిలిచిపోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు సంస్థలు ఉగ్రదాడి కోణంలో కూడా పరిశీలిస్తున్నాయి. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ప్రమాదం అనంతరం లాగార్డియా విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేయగా, రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికుల్లో తీవ్ర భయం నెలకొంది.