Booster Dose: మూడో డోసు కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు

|

Sep 14, 2021 | 7:01 AM

Booster Dose: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తోపాటు..

Booster Dose: మూడో డోసు కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు
Follow us on

Booster Dose: గత ఏడాదికిపైగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తోపాటు పలు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇక ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ కట్టడికి పలు దేశాలు మూడో డోసు కరోనా వ్యాక్సిన్‌ను అందించాలని నిర్ణయించాయి. ఈ బూస్టర్ జ్యాబ్స్ వల్ల డెల్టా వంటి వేరియంట్ల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందని ఈ దేశాలు బలంగా నమ్ముతున్నాయి. అయితే వీటి అవసరం ప్రస్తుతం లేదని తాజాగా చేసిన ఒక అధ్యయనంలో తేలింది.

ఇప్పుడు తీసుకుంటున్న రెండు డోసుల వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్‌పై బాగానే ప్రభావం చూపుతోందని పరిశోధనలలో స్పష్టం చేసింది శాస్త్రవేత్తలు. ఈ తాజా అధ్యయనం వివరాలు ‘ది ల్యాన్సెట్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు.

బూస్టర్‌ డోసు ఇవ్వడం సరికాదు..

ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ప్రజానీకానికి బూస్టర్ డోస్ ఇవ్వడం సరికాదని శాస్త్రవేత్తలు తేల్చారు. డెల్టా సహా అన్ని వేరియంట్లపై ప్రస్తుతం లభిస్తున్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని, కరోనా లక్షణాలు కనిపించని అసింప్టమాటిక్ కేసులను నియంత్రించడంలో వ్యాక్సిన్ కొంత వెనకబడినా కూడా బూస్టర్ డోస్ అవసరం లేదని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.

తీవ్రమైన కరోనా నుంచి వ్యాక్సిన్లు రక్షణ ఇవ్వలేవని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేవని తెలిపిన శాస్త్రవేత్తలు.. బూస్టర్ డోస్ ఇవ్వడం కన్నా ముఖ్యంగా వ్యాక్సిన్ అందని ప్రాంతాలకు వీటిని సరఫరా చేయడం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇలా చేయడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకను నివారించవచ్చని, తద్వారా కరోనాను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని డబ్ల్యూహెచ్‌వోకు చెందిన అనా మరియా హెనావో రెస్ట్రెపో అనే శాస్త్రవేత్త వివరించారు.

కాగా, కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగం అవుతోంది. ఒక వైపు లాక్‌డౌన్‌, మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడం వల్ల ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులో ఉంది. రోజురోజుకు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో ఆందోళన నెలకొంది. కరోనా తగ్గుముఖం పట్టినా.. జాగ్రత్తలు తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం, కరోనా నిబంధనలు పాటించినట్లయితే థర్డ్‌వేవ్‌ రాకుండా జాగ్రత్త పడవచ్చని పేర్కొంటున్నారు.

ఇవీ కూడా చదవండి: Telangana: గుడ్ న్యూస్.. ప్రతి రోజూ 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు.. స్పెషల్ డ్రైవ్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

AP Covid-19 Vaccination: ఏపీ మరో రికార్డు.. ఆ వారియర్స్‌కి 100 శాతం వ్యాక్సినేషన్‌..