వాంతి చేసుకునే క్రమంలో.. ఫోర్క్ మింగిన మహిళ!

Woman swallows fork: సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఫోర్క్‌ను ఉపయోగిస్తాం. కానీ అదే ఫోర్క్ కడుపులోకి వెళ్తే? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ! న్యూజిలాండ్‌లో ఓ 27 ఏళ్ల మహిళకు ఇలాంటి వింత అనుభవమే ఎదురైంది. వాంతులు చేసుకోవడానికి ప్రయత్నించిన ఆమె అనుకోకుండా ఏకంగా ఫోర్క్‌నే మింగేసింది. దీంతో కడుపులోకి వెళ్లిన ఫోర్క్‌ను బయటకు తీసేందుకు వైద్యులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరకు ఆపరేషన్ చేసి దానిని బయటకు తీశారు. ఈ ఘటన గురించి తెలిసి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.

వాంతి చేసుకునే క్రమంలో.. ఫోర్క్ మింగిన మహిళ!
Woman Swallows Full Sized Fork While Trying To Vomit

Updated on: Nov 23, 2026 | 6:44 PM

న్యూజిలాండ్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ ఓ సామాజిక కార్యక్రమంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమె వాంతి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా అనుకోకుండా పూర్తిస్థాయి డిన్నర్ ఫోర్క్‌ను మింగేసింది. అయితే ఆమె ఎందుకు వాంతులు చేసుకోవాలని ప్రయత్నించింది? ఫోర్క్‌ను ఎలా ఉపయోగించింది? అనే విషయాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటన తర్వాత ఆమె వెంటనే ఆసుపత్రికి వెళ్లింది.

వైకాటో ఆసుపత్రికి చేరుకున్న మహిళకు వైద్యులు ఎక్స్‌రే చేసారు. అందులో కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె కడుపులో చిన్న వస్తువేదో కాదు ఏకంగా భోజనం చేసేందుకు ఉపయోగించే పెద్ద ఫోర్క్ ఉంది. అది కూడా పూర్తిస్థాయిలో కడుపులోకి వెళ్లిపోయింది. దీంతో వైద్యులు బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

రెండుసార్లు ప్రయత్నించినా బయటకు రాని ఫోర్క్!

మొదట వైద్యులు ఆపరేషన్ అవసరం లేకుండానే ఎండోస్కోపీ నోటి ద్వారా ఫోర్క్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. సాధారణంగా చిన్న చిన్న వస్తువులను ఎవరైనా మింగితే అవి జీర్ణవ్యవస్థ గుండా బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఇంత పెద్ద వస్తువు కడుపులో ఉండటం ప్రమాదకరం. అది లోపలి అవయవాలకు గాయాలు చేసే అవకాశం ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.

డాక్టర్లకు కూడా అంతుచిక్కని విషయం!

ఈ ఘటనపై డాక్టర్ జెస్సీ ఫిషర్ మాట్లాడుతూ విదేశీ వస్తువులను మింగిన కేసులు ఆసుపత్రులకు రావడం కొత్తేమీ కాదని చెప్పారు. అయితే ఈ మహిళ విషయంలో పరిస్థితి వేరుగా ఉందన్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉంటుందని, కానీ ఈ మహిళకు అలాంటి సమస్యలు ఉన్నట్లు ఎలాంటి వైద్య రికార్డులు లేవని స్పష్టం చేశారు. ఆమె కడుపులోకి అంత పెద్ద ఫోర్క్ ఎలా వెళ్లిందనేది ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ సక్సెస్.. రెండు రోజులకే ఇంటికి!

చివరకు వైద్యులు ఆపరేషన్‌ చేసి కడుపులో నుంచి ఫోర్క్‌ను విజయవంతంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఆపరేషన్ తర్వాత ఎలాంటి పెద్ద సమస్యలు ఎదురుకాలేదు. మహిళ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడటంతో రెండు రోజులకే డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత ఆమె సాధారణ ఆహారం తీసుకునే స్థితికి చేరుకున్నట్లు డాక్టర్ తెలిపారు. వాంతి చేసుకోవడానికి ఫోర్కులు, ఇతర వస్తువులను ఉపయోగించడం ప్రమాదకరమని ప్రజలకు కీలక సూచన చేశారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మొత్తానికి వాంతి చేసుకోవాలని ప్రయత్నించిన మహిళకు చివరకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న పొరపాటు ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది!

Loading...
Unable to load recommendations.
Follow Us