
సాధారణంగా భూమిపై పిడుగులు పడటం గురించి విని ఉంటారు. పిడుగుపాటుకు గురై మనుషులు, జంతువులు చనిపోవడం, చెట్లు కాలిపోవడం కూడా చూసి ఉంటారు. కానీ పిడుగు భూమికి చేరడానికి ముందే.. ఆకాశంలోనే గాల్లో ఉన్న విమానాన్ని తాకితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? తాజాగా అలాంటి భయానక సంఘటన చోటు చేసుకుంది. కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో పిడుగుపాటుకు గురవడంతో అత్యవసరంగా తిరిగి కొలంబోకు మళ్లించాల్సి వచ్చిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానంలో 207 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. విమానాన్ని పిడుగు తాకిన సమయంలో భారీ శబ్దం వినిపించిందని ప్రయాణికులు తెలిపారు. అంతేకాకుండా, ఇంజిన్లలో ఒకదాని నుంచి క్షణిక కాలం పాటు మంటలు లేదా నిప్పురవ్వలు కనిపించాయని వారు పేర్కొన్నారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, విమాన సిబ్బంది పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో విమానం సమీపంలో నిప్పురవ్వలు కనిపించినట్లు, అనంతరం అది సురక్షితంగా కొలంబోకు తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. అనంతరం పైలట్లు ప్రయాణికులకు వివరాలు తెలియజేస్తూ, పిడుగుపాటు కారణంగా ఒక ఇంజిన్‌కు స్వల్ప నష్టం జరిగినట్లు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా సిడ్నీ ప్రయాణాన్ని రద్దు చేసి విమానాన్ని తిరిగి కొలంబోకు మళ్లించినట్లు తెలిపారు.
“ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన ఆపరేషనల్ ఘటన కారణంగా విమానం వెనక్కి మళ్లించబడింది” అని విమానయాన సంస్థకు చెందిన ఒక వర్గం వెల్లడించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులు లేదా సిబ్బందిలో ఎవరూ గాయపడలేదు. విమానం బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మరోసారి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమాన భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతను గుర్తు చేసింది. విమానయాన సంస్థ అధికారులు ఘటనపై సాంకేతిక పరిశీలనలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
SriLankan Airlines UL606 Returns to Colombo After Reported Lightning Strike
Courtesy: @asantha_azhb#SriLankanAirlines #UL606 #AviationNews #ColomboAirport pic.twitter.com/0vlQnSZ2xd
— DailyMirror (@Dailymirror_SL) June 13, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి