హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి.

హిజ్బుల్లా‌కు బిగ్ షాక్.. 900 ఏళ్ల నాటి చారిత్రాత్మక లెబనాన్‌ బ్యూఫోర్ట్ కోట ఇజ్రాయెల్ వశం..!
Beaufort Castle

Updated on: May 31, 2026 | 6:18 PM

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని అత్యంత వ్యూహాత్మకమైన, సుమారు 900 ఏళ్ల పురాతన చారిత్రాత్మక బ్యూఫోర్ట్ కోటను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దానికి ఆనుకుని ఉన్న కీలకమైన కొండను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) అధికారికంగా ప్రకటించాయి. ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూపునకు ఇది ఒక ప్రధాన స్థావరమని, ఇక్కడి నుంచే వారు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారని సైన్యం స్పష్టం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ ఒప్పందం జరిగి ఆరు వారాలు గడుస్తున్నా ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోగా, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమైంది.

బ్యూఫోర్ట్ రిడ్జ్ , వాడి అల్-సలూకీ ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించడమే లక్ష్యంగా ఈ భారీ సైనిక చర్యను చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలో హిజ్బుల్లా బలగాలు ఇరాన్ సహాయంతో భారీగా సైనిక మౌలిక సదుపాయాలను, ఆయుధ డిపోలను ఏర్పాటు చేశాయని ఇజ్రాయెల్ గుర్తించింది. అందువల్ల ఈ ఆపరేషన్‌లో భాగంగా వారి స్థావరాలు, లాంచ్‌ప్యాడ్‌లు, సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ భీకర పోరులో ఒక ఇజ్రాయెల్ సైనికుడు కూడా మరణించినట్లు IDF ధృవీకరించింది. కాగా, ఈ పరిణామాలపై లెబనీస్ ప్రభుత్వం కానీ, హిజ్బుల్లా కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇజ్రాయెల్ సైనిక వ్యూహకర్తల ప్రకారం, బ్యూఫోర్ట్ కోట మరియు దాని పరిసర కొండలు భౌగోళికంగా అత్యంత కీలకమైన ప్రదేశంలో ఉన్నాయి. ఈ ఎత్తైన కొండల పైనుంచి దక్షిణ లెబనాన్ అంతటితో పాటు ఉత్తర ఇజ్రాయెల్‌లోని చాలా ప్రాంతాలను స్పష్టంగా వీక్షించవచ్చు. ఈ అనుకూలతను వాడుకుని హిజ్బుల్లా ఇక్కడి నుంచే ఇజ్రాయెల్ నగరాలు, సైనిక స్థావరాలపై వందలాది రాకెట్లు, ఇతర నిఘా ఆయుధాలను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

శనివారం (మే 30) హిజ్బుల్లా జరిపిన భారీ రాకెట్ దాడుల నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈ ఎదురుదాడికి దిగింది. ఏప్రిల్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా చేసిన అత్యంత పెద్ద దాడి ఇదేనని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడుల తదనంతర పరిణామాల వల్ల సరిహద్దుల్లోని అనేక ప్రాంతాలలో పాఠశాలలను మూసివేసి, సైన్యం కఠినమైన భద్రతా ఆంక్షలను విధించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us