Ramanujan Prize 2021 winner Neena Gupta: భారత గణిత శాస్త్రవేత్త ప్రొఫసర్ నీనా గుప్తా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం సాధించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే ‘రామానుజన్ ప్రైజ్ ’కు 2021 సంవత్సరానికి గాను ఆమె ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ISI Kolkata)లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన నాలుగో భారత గణిత శాస్త్రవేత్త కావడం విశేషం. అలాగే ఈ అవార్డును సాధించిన మూడో మహిళగా నీనా గుప్తా గుర్తింపు సాధించారు. ఆమె కంటే ముందు భారత్ గణితశాస్త్రవేత్తలు రామదురై సుజాత(2006), అమలేందు కృష్ణ(2015), రీటాబత మన్షి(2018) ఈ అవార్డును సాధించారు. నీనా గుప్తా కంటే ముందు ఈ అవార్డును సాధించిన మరో ముగ్గురు భారత గణిత శాస్త్రవేత్తలకు కూడా ఐఎస్ఐ కోల్‌కత్తాతో అనుబంధం ఉండటం విశేషం.
అఫిన్ అల్జీబ్రిక్ జామిట్రీ, కమ్యుటేటివ్ అల్జీబ్రాలో చేసిన విశేష కృషికిగానూ ఆమెను ఈ అవార్డు సాధించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2005 నుంచి ఈ అవార్డును యువ గణితశాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ప్రతియేటా 45 ఏళ్ల కంటే తక్కువ వయస్కులైన యువ గణితశాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. రామానుజన్ ప్రైజ్ కమిటీలో ప్రపంచ నలుమూలలకు చెందిన పలువురు ప్రముఖ గణతశాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్నారు.
‘రామానుజన్ ప్రైజ్’ అవార్డును గెలుచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు నీనా గుప్తా పేర్కొన్నారు. గణిత శాస్త్రంలో తన పరిశోధనలను మరింత లోతుగా కొనసాగించేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. కమ్యుటేటివ్ అల్జీబ్రాలో ఇంకా సాధించాల్సింది ఎంతో మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. గణితశాస్త్రంలో ఇప్పటి వరకు సమాధానాలు లేని పలు ప్రశ్నలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
చిన్నతనం నుంచే గణితశాస్త్రం తనకు ఇష్టమైన సబ్జెక్ట్‌గా నీనా గుప్తా తెలిపారు. అయితే గణితశాస్త్రంలో ఉన్నత చదువులతో ఈ రంగాన్నే కెరీర్‌కా కొనసాగిస్తానని భావించలేదన్నారు. గణితంలో డిగ్రీ కోర్సు తీసుకున్నాక.. తన ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు తనను ప్రోత్సహించారని చెప్పారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వివరించారు.
Also Read..