
కెనడా: సైనిక శిక్షణా శిబిరంలో ఊహించని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వ్యాపించిన గడ్డి మంటలు సైనికులను చుట్టుముట్టడంతో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 39 మంది గాయపడ్డారు. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లో ఉన్న వైన్‌రైట్ సైనిక శిక్షణా స్థావరంలో అక్టోబర్ 17న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషాదంపై దేశ ప్రధాని మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
క్షణాల్లో చుట్టుముట్టిన మంటలు
ప్రిన్సెస్ ప్యాట్రిసియాస్ కెనడియన్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన మూడో బెటాలియన్ సైనికులు అత్యంత తీవ్రమైన పోరాట శిక్షణలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 84 మంది సైనికులు గ్రెనేడ్ శిక్షణ ప్రాంతం, శత్రు స్థావరాలపై దాడులను అనుకరించే ప్రదేశంలో ఉన్నారు. ఈ క్రమంలో గడ్డికి అంటుకున్న మంటలు బలమైన గాలుల కారణంగా వేగంగా వ్యాపించాయి.
మేజర్ జనరల్ వేడ్ రట్లాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, గాలి దిశ అకస్మాత్తుగా మారడంతో మంటలు కేవలం 36 సెకన్లలో కిలోమీటరు దూరాన్ని దాటి సైనికుల వైపు దూసుకొచ్చాయి. పరిస్థితిని గుర్తించి స్పందించేలోపే పలువురు మంటల మధ్య చిక్కుకుపోయారు. గడ్డికి నిప్పు ఎలా అంటుకుందనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
నలుగురు సైనికుల మృతి.. 19 మందికి విషమం
ఈ ప్రమాదంలో మరణించిన వారిని సార్జెంట్ మోర్గాన్ వాంగ్, ప్రైవేట్ షాన్ ఫారెల్, ప్రైవేట్ ఐడాన్ గౌల్డింగ్, ప్రైవేట్ హేడెన్ లైక్మార్క్గా సైన్యం గుర్తించింది. వీరంతా మూడో బెటాలియన్‌లో పనిచేస్తున్నారు.
గాయపడిన 39 మందిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉండగా, ఎనిమిది మంది పరిస్థితి నిలకడగా ఉంది. మరో 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా కాలిన గాయాలైన వారికి వారాలు, నెలలపాటు చికిత్స అవసరమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రంగంలోకి అత్యవసర బృందాలు
గాయపడిన వారిని ఎడ్మంటన్, కాల్గరీ, రెడ్ డీర్ నగరాల్లోని నాలుగు ఆసుపత్రులకు తరలించారు. సహాయక చర్యల్లో 22 అంబులెన్సులు, ఆరు విమానాలు, రెండు హెలికాప్టర్లు పాల్గొన్నాయి. సైనిక శోధన, రక్షణ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఈ ఘటనను శాంతికాలంలో కెనడా ఎదుర్కొన్న అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా ప్రధాని మార్క్ కార్నీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫెడరల్ భవనాలపై జాతీయ జెండాలను సగం వరకు దించాలని ఆదేశించారు.
ప్రమాదంపై సైనిక దర్యాప్తు
గాలి వేగం, దిశలో మార్పులు, అగ్ని నిరోధక మార్గాలు మంటలను అడ్డుకోలేకపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శిక్షణ సమయంలో భద్రతా చర్యలు సరిగ్గా అమలయ్యాయా అనే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడికానుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..