
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పద్మా నదిలో పడిపోవడంతో పదహారు మంది మరణించారు. ఈద్ పండుగ జరుపుకుని ఢాకాకు తిరిగి వస్తుండగా డౌలత్దియా ఫెరీఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు పిల్లలు, మహిళలతో సహా సుమారు 40 మంది ఆ బస్సులో ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి చాలా మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసలు సహాయక చర్యలు ప్రారంభించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలో దాదాపు ఆరు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన తర్వాత, క్రేన్ సహాయంతో బస్సును నది నుండి బయటకు తీశారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, బుధవారం (మార్చి 26) సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో రాజ్‌బారి జిల్లాలోని దౌలత్‌దియా టెర్మినల్ వద్ద ఫెర్రీ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాణికులతో నిండిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో తీవ్ర గందగోళం నెలకొంది. బస్సును బయటకు తీయగా, బస్సు లోపల చిక్కుకున్న 14 మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందే డైవర్ తోపాటు ఇద్దరు మహిళల మృతదేహాలను వెలికితీశారు. కాగా ఇప్పటి వరకు ధృవీకరించిన మృతుల సంఖ్య 16కు చేరింది. పలువురు ఇంకా గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సైన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బస్సు ఫెర్రీని సమీపిస్తుండగా, ఒక చిన్న యుటిలిటీ ఫెర్రీ పాంటూన్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు నేరుగా నదిలోకి దూసుకుపోయింది. కొంతమంది ఈదుకుంటూ బయటపడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా, చాలామంది ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. ఇంకా పలువురు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
ప్రయాణికులలో చాలామంది ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నట్లు సమాచారం. బస్సు బయట నిలబడిన వారు ప్రాణాలతో బయటపడగా, బస్సులో చిక్కుకున్న వారు మునిగిపోయారు. ఈ ఘటన హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ వెంటనే అధికారులను సంప్రదించి సమాచారం సేకరించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఈ ఘటన పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వీడియో ఇక్కడ చూడండి..
The Catastrophic Moment When The Bus Fell In Mighty Padma While Boarding In A Ferry.
Unfortunate Unfortunate
I Have Never Seen Scenes Like This In Bangladesh History From A Ferry https://t.co/ej31yNwI7y pic.twitter.com/q2Mm1MYRzh
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) March 25, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..