
క్రీ.శ. 79లో ఇటలీలో వెసూవియస్ అగ్నిపర్వతం బద్ధలైంది. పాంపీ, హెర్క్యులేనియం వంటి రోమన్ నగరాలు అగ్నిపర్వత బూడిద, వేడి పదార్థాల కింద కూరుకుపోయాయి. ఆ సమయంలో హెర్క్యులేనియం బేకరీలోని ఓవెన్లో రొట్టె కాలుతోంది. ఇటీవల తవ్వకాల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ రొట్టె కనిపించింది. అప్పటికే అది పూర్తిగా నల్లగా మారి బొగ్గులా తయారైంది. అయినప్పటికీ దాని అసలు ఆకారం, పైభాగంలో ఎనిమిది గీతలు స్పష్టంగా కనిపించాయి. దానిపై ఓ ముద్ర కూడా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.
పురాతన రోమన్లు తయారుచేసే రొట్టెలు ఇప్పటి రొట్టెలకు కొంత భిన్నంగా ఉండేవి. కాల్చడానికి ముందు పై భాగాన గీతలు గీసేవారు. ఈ రొట్టెలను ‘పానిస్ క్వాడ్రాటస్’ (Panis Quadratus) అని పిలిచేవారు. లాటిన్ భాషలోని ‘క్వాడ్రా’ అంటే ఎనిమిది భాగాలుగా విభజించడం అనే అర్థం వస్తుంది. మొదట రొట్టెను రెండు, ఆ తర్వాత నాలుగు, చివరకు ఎనిమిది భాగాలుగా విభజించేలా గీతలు పెట్టేవారు.
2,000 Year Old Bread Found At Pompeii Excavation
అప్పట్లో ఇళ్లలోనే పిండి ముద్దను తయారుచేసి వాటిని కాల్చడానికి పబ్లిక్ ఓవెన్లను ఉపయోగించేవారు. ఒకే ఓవెన్లో వేర్వేరు కుటుంబాలకు చెందిన రొట్టెలు కాల్చడంతో ఏ రొట్టె ఎవరిదో గుర్తించేందుకు ముద్రలు ఉపయోగపడేవని పరిశోధకులు భావిస్తున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనం ఓ నగరాన్ని బూడిద కింద కప్పేసినా, అక్కడి ప్రజల జీవనశైలికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లను భద్రపరిచింది. దాదాపు 2 వేల ఏళ్ల నాటి ఈ రొట్టె ద్వారా అప్పటి ప్రజలు ఏం తినేవారు? ఎలా వండుకునేవారు? ఆహారాన్ని ఎలా విక్రయించేవారు? తెలుసుకునే అవకాశం పరిశోధకులకు లభించింది.
ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో చెప్పడానికి ఇటలీలోని వెసూవియస్ అగ్నిపర్వత విస్ఫోటనం ఓ నిదర్శనం. దాదాపు 2 వేల ఏళ్ల క్రితం సంభవించిన ఈ విస్ఫోటనం ఏకంగా నాలుగు పురాతన రోమన్ నగరాలను నాశనం చేసింది. భారీగా వెలువడిన బూడిద, వేడి అగ్నిపర్వత పదార్థాలు నగరాలను పూర్తిగా కప్పేశాయి. అయితే ఇదే బూడిద పొరలు ఆ నగరాల్లోని భవనాలు, చిత్రాలు, వస్తువులు, ప్రజల ఆనవాళ్లను వేల ఏళ్లపాటు భద్రపరిచాయి.
Mount Vesuvius Eruption Destroyed Roman Cities Pompeii And Herculaneum
ఇటలీలోని కాంపానియా ప్రాంతంలో ఉన్న వెసూవియస్ అగ్నిపర్వతం క్రీ.శ. 79లో విస్ఫోటనం చెందింది. పాంపీ, హెర్క్యులేనియం, ఓప్లోంటిస్, స్టాబియే పురాతన రోమన్ నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద, రాళ్లు, వేడి నగరాలను కప్పేసాయి. వేల ఏళ్ల నాటి భవనాలు, గోడలపై వేసిన చిత్రాలు (ఫ్రెస్కోలు), కళాఖండాలు, రోజువారీ జీవితంలో ఉపయోగించిన వస్తువులు భద్రంగా ఉన్నాయి. విస్ఫోటనం సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల శరీరాల ఆనవాళ్లూ మిగిలాయి.
వేలాది మంది నివసించిన నగరాలను క్షణాల్లో నాశనం చేసిన వెసూవియస్ అగ్నిపర్వత విస్ఫోటనం.. అనుకోకుండా ప్రాచీన రోమన్ నాగరికతకు సంబంధించిన ఎన్నో రహస్యాలను భవిష్యత్తు తరాల కోసం భద్రపరిచింది. ఈ ప్రాంతాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా పురావస్తు పరిశోధకులకు విలువైన చారిత్రక సంపదగా నిలిచాయి.