2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!

టర్కీలోని పురాతన ట్రాయ్ నగరంలో దాదాపు 2,800 ఏళ్ల నాటి ఎముకతో తయారు చేసిన వేణువు బయటపడింది. ఇటీవల రూపొందుతున్న ‘ఒడిస్సీ’ సినిమాకు ఈ ఆవిష్కరణకు పోలిక ఉంది. సినిమాలో సైరన్ల పాట కోసం చిత్ర బృందం క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన వేణువును పోలిన వాయిద్యాన్ని పునర్నిర్మించి సంగీతాన్ని కంపోజ్‌ చేసారు.

2,800 ఏళ్ల నాటి వేణువు.. ‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతో పోలిక!
2,800 Year Old Bone Flute Found At Ancient Troy By Archaeologists

Updated on: Oct 29, 2026 | 8:49 AM

టర్కీలోని పురాతన ట్రాయ్ నగరంలో దాదాపు 2,800 ఏళ్ల నాటి ఎముకతో తయారు చేసిన వేణువు బయటపడింది. దీంతో అప్పటి ప్రజల సంగీత అభిరుచులు, సాంస్కృతిక జీవనంపై కొత్త ఆధారాలు లభించినట్లైంది. ఇటీవల రూపొందుతున్న ‘ఒడిస్సీ’ సినిమాకు ఈ ఆవిష్కరణకు పోలిక ఉంది. సినిమాలో సైరన్ల పాట కోసం చిత్ర బృందం క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన వేణువును పోలిన వాయిద్యాన్ని పునర్నిర్మించి సంగీతాన్ని కంపోజ్‌ చేసారు.

సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చిన ట్రాయ్ ప్రజలు!

ఎముకతో తయారైన వేణువు క్రీ.పూ. 750 నుంచి 480 మధ్య కాలం అంటే దాదాపు 2,500 నుంచి 2,800 ఏళ్ల నాటిది. ఈ వేణువు బయటపడిన కాలంలో సంగీతం ప్రజల జీవితాల్లో భాగమని పరిశోధకులు భావిస్తున్నారు. అప్పట్లో మతపరమైన ఆచారాలు, సామాజిక కార్యక్రమాలు, బహిరంగ వేడుకల్లో సంగీతం ప్రధానంగా ఉండేది. ట్రాయ్ నగరం శతాబ్దాల పాటు ప్రాధాన్యం కోల్పోయిన తర్వాత మళ్లీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ వేణువు తయారై ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటి ప్రజలు ఎలాంటి స్వరాలను పలికించేవారు? వంటి ప్రశ్నలకు ఈ ఆవిష్కరణ ద్వారా సమాధానాలు లభించే అవకాశం ఉంది.

‘ఒడిస్సీ’ సినిమా సంగీతంతోనూ ఆసక్తికర పోలిక!

ఇటీవల రూపొందుతున్న ‘ఒడిస్సీ’ సినిమా సంగీతం విషయంలోనూ ఈ ఆవిష్కరణకు ఆసక్తికరమైన పోలిక ఉంది. సినిమాలో సైరన్ల పాటను రూపొందించేందుకు చిత్ర బృందం క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన వేణువును పోలిన వాయిద్యాన్ని పునర్నిర్మించి ప్రయోగాత్మక సంగీతాన్ని కంపోజ్ చేసింది.  ట్రాయ్‌లో బయటపడిన ఈ ఎముక తో తయారైన వేణువు కేవలం పురాతన వస్తువు మాత్రమే కాదు. వేల ఏళ్ల క్రితం అక్కడి ప్రజల జీవనశైలి, సంగీత సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే ఏకైక ఆధారం.

4,500 ఏళ్ల నాటి మానవాకార బొమ్మ కూడా లభ్యం!

ఎముక వేణువుతో పాటు మరో అరుదైన వస్తువు కూడా తవ్వకాల్లో బయటపడింది. దాదాపు 4,500 ఏళ్ల నాటి మానవాకార బొమ్మ (Humanoid Idol) పరిశోధకులకు లభించింది. ట్రాయ్ నగరం ఒకప్పుడు అగ్నిప్రమాదానికి గురైనట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో ట్రాయ్ రక్షణ గోడలతో నివాస ప్రాంతంగా ఉండేది. డార్డనెల్లెస్ జలసంధికి సమీపంలో ఉండటంతో పశ్చిమ అనటోలియాలోని ఇతర నాగరికతలతో దీనికి సంబంధాలు ఉండేవి. ఈ మానవాకార బొమ్మ అప్పటి ప్రజల మత విశ్వాసాలు, ఆచారాలు, కళా సంప్రదాయాల గురించి సమాచారాన్ని  తెలిపే అవకాశం ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

హోమర్ రచనలతో వేణువుకు సంబంధం

ఈ వేణువు బయటపడిన కాలం.. ప్రాచీన గ్రీకు కవి హోమర్ ప్రసిద్ధ ఇతిహాసాలు ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’ రచనల కాలంతో సరిపోలుతోంది. ‘ఇలియడ్’ ఇతిహాసం ట్రాయ్ యుద్ధం చుట్టూ సాగుతుంది.  కథలో  ‘ట్రోజన్ హార్స్’  ప్రస్తావన ఉంది.  గ్రీకు సైనికులు ట్రోజన్ గుర్రంతో ట్రాయ్ నగరాన్ని జయించారు. ‘ఇలియడ్‌’లోని ఒక భాగంలో ట్రాయ్ మైదానంలో వెలుగుతున్న మంటలు, వేణువులు, ఇతర సంగీత వాయిద్యాల శబ్దాల గురించి హోమర్ ప్రస్తావించారు. ఇప్పుడు అదే కాలానికి చెందిన వేణువు ట్రాయ్‌లో బయటపడటం ఆసక్తిని పెంచుతోంది.

Trojan Horse Is A Wooden Horse Constructed By Greeks To Gain Entry Into Troy

గ్రీకు పురాణాల ప్రకారం.. ట్రాయ్ నగరాన్ని జయించేందుకు గ్రీకు సైన్యం పదేళ్ల పాటు యుద్ధం చేసింది. అయినప్పటికీ, నగరాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. దీంతో గ్రీకు వీరుడు ఒడిసియస్ ఓ కొత్త వ్యూహాన్ని రచించాడు. ప్రధాన వడ్రంగి ఎపియస్‌ సహాయంతో లోపల ఖాళీగా ఉండేలా భారీ చెక్క గుర్రాన్ని తయారు చేయించాడు. ఆ గుర్రం లోపల గ్రీకు సైనికులు దాక్కునేంత స్థలం ఉండేలా రూపొందించారు. అనంతరం గ్రీకు సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోతున్నట్లు నటించింది. తమ నౌకాదళం సమీపంలోని టెనెడోస్‌ ద్వీపం వైపు వెళ్లిపోయినట్లు చూపించింది.

గుర్రాన్ని బహుమతిగా నమ్మించిన గ్రీకు గూఢచారి!

గ్రీకు సైన్యం వదిలివెళ్లిన చెక్క గుర్రాన్ని చూసి ట్రాయ్ ప్రజలు ఆశ్చర్యపోయారు. అది ఎందుకు అక్కడ ఉందో వారికి అర్థం కాలేదు. ఆ సమయంలో  సైనోన్‌ అనే గ్రీకు గూఢచారి ఆ గుర్రం గ్రీకులు దేవత అథీనాకు సమర్పించిన పవిత్ర కానుక అని ట్రాయ్ ప్రజలను నమ్మించాడు. ఆ గుర్రాన్ని నగరంలోకి తీసుకెళ్తే ట్రాయ్‌కు మేలు జరుగుతుందని చెప్పాడు.

హెచ్చరికలను పట్టించుకోని ట్రాయ్ ప్రజలు!

అయితే, అందరూ ఆ గుర్రాన్ని నమ్మలేదు. ట్రాయ్ యువరాణి కసాండ్రా ఆ గుర్రం వల్ల ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. చివరకు నగర రక్షణ గోడల్లో కొంత భాగాన్ని తొలగించి, ఆ భారీ చెక్క గుర్రాన్ని లోపలికి తీసుకెళ్లారు. తమ విజయానికి గుర్తుగా భావించిన ఆ గుర్రం.. తమ వినాశనానికి కారణమవుతుందని వారు ఊహించలేకపోయారు.

అర్ధరాత్రి బయటకు వచ్చిన గ్రీకు సైనికులు!

రాత్రి కాగానే చెక్క గుర్రం లోపల దాక్కున్న గ్రీకు సైనికులు నెమ్మదిగా బయటకు వచ్చారు. నగర ద్వారాలను తెరిచి గ్రీకు సైన్యాన్ని లోపలికి అనుమతించారు.ఆ తర్వాత గ్రీకు సైన్యం ట్రాయ్ నగరంపై దాడి చేసి  స్వాధీనం చేసుకుంది. ఇలా ట్రాయ్ ప్రజలు తమ చేతులతోనే శత్రువులను నగరంలోకి ఆహ్వానించినట్లయింది. ‘ట్రోజన్ హార్స్‌’ కథ శత్రువుల వ్యూహాన్ని గుర్తించడంలో విఫలమైతే ఎంతటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పే ఉదాహరణగా నిలిచింది. అందుకే నేటికీ మోసపూరిత వ్యూహాలను ‘ట్రోజన్ హార్స్‌’తో పోలుస్తుంటారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us