పక్కింటి వారి వల్ల నిద్ర కరువైంది.. అమెరికాలో ఇండియన్ ఫ్యామిలీ పై ఫిర్యాదు

Updated on: Apr 25, 2026 | 11:44 AM

అమెరికాలోని ఫ్రిస్కోలో భారతీయ కుటుంబం 5 AM దినచర్య పక్కింటి అమెరికన్ నిద్రకు భంగం కలిగించడం రెడిట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. అధిక శబ్దాలు, డ్రైవ్‌వే కడగడం, ముగ్గులు వేయడంపై ఫిర్యాదు చేసినా, ఆ కుటుంబం మార్పు రాలేదని పోస్ట్. ఇది సాంస్కృతిక అలవాట్లు, పౌర స్పృహ, ఇరుగుపొరుగు సంబంధాలపై విస్తృత చర్చకు దారితీసింది. నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయ కుటుంబం తీరుపై పక్కింటి అమెరికన్ చేసిన ఓ రెడిట్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట‌ పెద్ద చర్చకు దారితీసింది. సాంస్కృతిక అలవాట్లు, పక్కింటి వారితో నడుచుకోవాల్సిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత రెడిట్‌లో పోస్ట్‌ చేసిన కంప్లైంట్‌, ఆ తర్వాత స్క్రీన్‌షాట్ల రూపంలో ‘ఎక్స్’ లో వైరల్ అయింది. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో నివసిస్తున్న ఓ అమెరికన్ ఆ పోస్ట్ పెట్టారు. తాను ఆస్ట్రేలియా కంపెనీకి రిమోట్‌గా నైట్ షిఫ్టులో పనిచేస్తానని, తెల్లవారుజామున 2 గంటలకు లాగ్ ఆఫ్ అయి, 3 గంటలకు నిద్రపోతానని తెలిపారు. అయితే, తాను నిద్రపోయిన రెండు గంటలకే అంటే ఉదయం 5 గంటలకే తన పక్కింటి భారతీయ కుటుంబం రోజును ప్రారంభిస్తుందని, వారి అరుపులు, శబ్దాలతో తన నిద్రకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆ కుటుంబ సభ్యులు బయటకు వస్తారు. చుట్టూ నిశ్శబ్దంగా ఉండటంతో వారు మాట్లాడుకునే మాటలు చాలా గట్టిగా వినిపిస్తాయి. ఆ తర్వాత బకెట్లతో నీళ్లు తెచ్చి డ్రైవ్‌వేపై పోస్తారు. ఆ నీళ్లు చిమ్మే శబ్దం, తర్వాత గోడల అవతలి నుంచి కూడా వినిపించేంత గట్టిగా ఊడిచే శబ్దం వస్తుంది. ఇక ఆ తర్వాత వారు రంగురంగుల సుద్దముక్కలతో డ్రైవ్‌వేపై ముగ్గులు వేస్తూ నవ్వుతూ, మాట్లాడుకుంటారు. ఇది సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు సాగుతుంది. వారాంతాల్లో కూడా దీనికి మినహాయింపు లేదు, అని ఆయన తన పోస్టులో వివరించారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి తాను శాంతంగా ప్రయత్నించానని, తన పనివేళల గురించి వారికి వివరించి, శబ్దం తగ్గించమని లేదా కాస్త ఆలస్యంగా వారి పనులు ప్రారంభించమని కోరినట్లు తెలిపారు. అందుకు వారు నవ్వుతూ “మేం రోజూ ఇలాగే చేస్తాం” అని మర్యాదగా చెప్పారే తప్ప, వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన వాపోయారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు అమెరికన్ పౌరుడికి మద్దతుగా నిలిచారు. ఉదయం 5 గంటలకు శబ్దం చేయడం, అది సాంస్కృతిక అలవాటు అయినా సరే, స్థానిక నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించారు. చాలా నగరాల్లో ఉదయం 7 గంటల తర్వాతే శబ్దాలకు అనుమతి ఉంటుందని, పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు. మరోవైపు కొంతమంది ప్రవాస భారతీయులు కూడా ఆ కుటుంబం తీరును తప్పుబట్టారు. తెల్లవారుజామునే గట్టిగా మాట్లాడటం, శబ్దాలు చేయడం భారతదేశంలో సాధారణమే కావొచ్చు, కానీ అమెరికా లాంటి నిశ్శబ్ద ప్రదేశాలలో అది సివిక్‌ సెన్స్‌ లేకపోవడమే అవుతుందని విమర్శించారు. అయితే, మరికొందరు ఈ కథపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రతీరోజూ ఉదయం 5 గంటలకే లేచి, డ్రైవ్‌వే కడిగి, ముగ్గులు పెట్టే కుటుంబం ఉంటుందా అని, ఇది కేవలం కల్పిత కథ కావచ్చని కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ ఘటన, విభిన్న సంస్కృతుల ప్రజలు కలిసి జీవించేటప్పుడు ఎదురయ్యే సవాళ్లను, పరస్పర గౌరవం, సర్దుబాటు ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చోరీ అయిన ఫోన్.. డిటెక్టివ్‌‌గా మారి దొంగను పట్టుకున్న వ్యక్తి..

ఆ జలసంధిలో.. 124 నౌకల శకలాలు

ఏపీలో కొత్తగా 1.5 లక్షల పింఛన్లు !! దరఖాస్తులు తీసుకునేది ఎప్పటి నుంచి అంటే…?

దేశం పరువు తీశారుగా..! ఛీ.. అలా ఎలా చేశారురా

ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్

Follow Us