భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
మెక్సికో నగరం ఏటా పది అంగుళాలు భూమిలోకి కుంగుతోంది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడడమే దీనికి ప్రధాన కారణం. ఇది నగరం భవిష్యత్తుకు పెను ముప్పు. జకార్తా, జోషీమఠ్ వంటి నగరాలకు కూడా ఇదే పరిస్థితి. చరిత్రకు నిలయమైన మెక్సికో సిటీని కాపాడాలంటే నీటి వినియోగాన్ని నియంత్రించాలి, లేదంటే భారీ నష్టం తప్పదు.
ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు పెను ముప్పుగా మారుతున్న వేళ ఒక భారీ నగరం ఏటా పది అంగుళాల మేర భూమిలోకి కుంగిపోతోందన్న వార్త అందరినీ షాకయ్యేలా చేస్తోంది. అమెరికా ఉపగ్రహాలు పంపిన ఫొటోల ద్వారా ఈ భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. మెక్సికో రాజధాని మెక్సికో సిటీ విపత్తుకు ఆ నగరంలోని ప్రజలు విచ్చలవిడిగా భూగర్భ జలాలను వాడటమే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి పొరల లోపల ఉన్న నీరు ఖాళీ కావడంతో పైన ఉన్న నేల కుంచించుకుపోయి నగరం మొత్తం కిందికి దిగిపోతోంది. దీనివల్ల భవిష్యత్తులో నగరం ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ప్రపంచంలోనే జనసాంద్రత కలిగిన నగరాల్లో మెక్సికో సిటీ ఒకటి . ఈ సిటీ విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సుమారు 2.2 కోట్ల జనాభా నివసిస్తోంది. మెక్సికన్ సిటీ, దాని చుట్టుపక్కల నగరాలు ఒక పురాతన లేక్ బెడ్‌పై నిర్మితమయ్యాయి. ఆ సిటీలో అనేక వీధులు ఒకప్పుడు కాలువలుగా ఉండేవి. కాలువలు పూడ్చేసి రోడ్లు నిర్మించారు. . నగరం కిందికి జారిపోతుండటంతో భారీ భవనాలు తీవ్రంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలకు బీటలు వారుతున్నాయి. సమస్య ఇలాగే కొనసాగితే భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ విపత్తును ఆపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు గట్టిగా కోరుతున్నారు. నీటి వినియోగంపై నియంత్రణ విధించాలని లేని పక్షంలో ఒక చారిత్రక నగరం భూస్థాపితం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయనీ హెచ్చరిస్తున్నారు. మెక్సికో సిటీ పదేళ్ల నుంచి కుంగుతూ వస్తోంది. 1573లో నిర్మితమైన మెట్రోపాలిటన్ కేథడ్రల్ స్పష్టంగా ఒక వైపుకు వంగిపోయి కనిపిస్తోంది. ఇండోనేషియా రాజధాని జకార్తా కూడా ఇదే తరహా ముప్పును ఎదుర్కొంటోంది. జకార్తా నగరం సముద్ర మట్టం కంటే వేగంగా కిందికి దిగిపోతుండటంతో ఆ దేశ ప్రభుత్వం తమ రాజధానిని ఏకంగా నుసంతారా అనే కొత్త ప్రాంతానికి మార్చాలని నిర్ణయించింది. మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పట్టణం ఇటీవలి కాలంలో భూమిలోకి కుంగిపోతూ వార్తల్లో నిలిచింది. పర్వత ప్రాంతాల్లో ఇష్టమొచ్చినట్లుగా చేపడుతున్న నిర్మాణాలు భూగర్భ జలాల అస్థిరత వల్ల వందలాది ఇళ్లు బీటలు వారి ప్రజలు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్‌లో పెట్టి..
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు