Viral Video: కొత్త థార్ కార్ కొన్న మహిళ.. తొలుత నిమ్మకాయ తొక్కిద్దాం అనుకుంది.. కట్ చేస్తే..

Updated on: Sep 10, 2025 | 1:39 PM

తూర్పు ఢిల్లీలో కొత్త థార్ డెలివరీ రోజే ప్రమాదానికి గురైంది. నిమ్మకాయ తొక్కించే సమయంలో కంగారులో యాక్సిలరేటర్‌ను గట్టిగా తొక్కడంతో కారు కింద పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో మహిళ క్షేమంగా బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

తూర్పు ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. కొత్త కారు కొనుగోలు చేసిన సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. ఒక మహిళ సుదీర్ఘంగా ఎదురుచూసి.. చివరకు రూ.27 లక్షలు వెచ్చించి మహీంద్రా థార్ కారును కొనుగోలు చేసింది. షోరూం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫస్ట్ ఫ్లోర్ డెలివరీ ఏరియాలో ఆమెకు కారు అందజేశారు. ఆనందంతో కారు లోపల కూర్చుని, మొదటి సారి స్టార్ట్ చేసింది. కారు స్టార్ట్ చేసిన వెంటనే సాంప్రదాయంగా నిమ్మకాయ తొక్కించి, దానిపై టైర్లు తిప్పి మంచి జరగాలని ప్రయత్నిస్తారు. అదే ఉద్దేశంతో మహిళ యాక్సిలరేటర్‌పై కాలు పెట్టింది. కానీ కంగారులో నెమ్మదిగా కాకుండా గట్టిగా తొక్కింది. ఒక్కసారిగా వేగం పెరిగి, కారు ముందు ఉన్న గ్లాస్ డోర్‌ను బలంగా ఢీకొట్టి కింద పడిపోయింది.

అదృష్టవశాత్తూ కారు ఎయిర్ బ్యాగ్స్ సమయానికి ఓపెన్ కావడంతో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు మాత్రం డెలివరీ రోజే నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ సంఘటనను చూసిన షోరూం సిబ్బంది, అక్కడున్న కస్టమర్లు షాక్‌కి గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు “ఇంత ఖరీదైన కారు కొనుగోలు చేసిన రోజే ఇలా జరగడం బ్యాడ్ లక్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు డ్రైవింగ్ స్కిల్ లేకపోతే కారు డెలివరీ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.