ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !

Updated on: Dec 08, 2025 | 11:47 AM

సాధారణంగా ఆలయాల్లో లడ్డూ, పులిహోర ప్రసాదాలుంటాయి. అయితే, రాజ్‌కోట్, చెన్నై సమీపంలోని కొన్ని ఆలయాలు పిజ్జా, పానీపూరీ, బర్గర్‌లను నైవేద్యంగా అందిస్తున్నాయి. పిల్లలు సంతోషంగా ప్రసాదం స్వీకరించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలయాలు ఈ వినూత్న సంప్రదాయాన్ని అవలంబిస్తున్నాయి. FSSAI సర్టిఫైడ్ ప్రసాదాలతో ఈ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

సాధారణంగా గుడిలో దేవునికి నైవేద్యంగా ఏం పెడతారు.. లడ్డూ, పాయసం, పులిహోర, చక్కెరపొంగలి పెడతారు. ఆ తర్వాత వాటిని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. భక్తులు ఎంతో భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంతేకానీ..ఇదేంటి విడ్డూరంగా పిజ్జా, పానీపూరీ ప్రసాదం అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమే. పిల్లలు సంతోషంగా ఉండాలని ఆ ఆలయంలో ఇలా ఏర్పాటు చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా రపుతానా గ్రామంలో దాదాపు 70 ఏళ్ల క్రితం జీవికా మాతాజీ ఆలయం స్థాపించారు. ఈ ఆలయంలో తల్లులు తమ పిల్లల ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో ఇక్కడ కొబ్బరి, చక్కెరతో చేసిన సాధారణ ప్రసాదమే ఉండేది. అయితే గుడికి వచ్చే పిల్లలు ఈ ప్రసాదాన్ని తినడానికి ఇష్టపడకపోవడంతో ఆలయ కమిటీ పిల్లలు ఇష్టంగా తినే ప్రసాదం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. గుడికి వచ్చే పిల్లలు అమ్మవారి ప్రసాదం సంతోషంగా తిని వెళ్లాలని.. పిల్లలకు ఇష్టమైన పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్, పానీపురిని ప్రసాదంగా పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం గుడికి వచ్చే భక్తులు ఈ ఆహారాలను స్వయంగా తెచ్చి దేవతకు నైవేద్యంగా సమర్పించి, తిరిగి వాటిని పిల్లలకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో పిల్లలు కూడా సంతోషంగా ప్రసాదం తింటున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలోని పడప్పాయ్‌లో ఉన్న జై దుర్గా పీఠం ఆలయంలో కూడా ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. హెర్బల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. శ్రీధర్ ఈ ఆలయాన్ని స్థాపించారు. ఇక్కడ కూడా సాధారణంగా పిజ్జా, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, పానీపురి, కూల్ డ్రింక్స్ దేవతకు నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా భక్తులు తమ పిల్లల పుట్టినరోజులను ఆలయంలో నమోదు చేసుకుంటే, ఆ రోజున ప్రత్యేకంగా కేక్‌ను కట్ చేసి ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలోని అన్ని ప్రసాదాలను ఆలయ పవిత్ర వంటగదిలో స్వచ్ఛతతో తయారు చేస్తారు. వీటికి FSSAI సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ విధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా దేవాలయాలు కూడా నూతన సంప్రదాయాలను పాటిస్తూ ఆకర్షణ కేంద్రాలుగా నిలుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డైనోసార్ల కాలం నాటి చేపను చూసారా !! ఇంకా బ్రతికే ఉంది

రోజుకు 15 నిమిషాలు నవ్వితే.. అద్భుత ప్రయోజనాలు