ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు ప్రారంభమయ్యాయి. అటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎండలు కొనసాగుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మొత్తానికి వారం ఆలస్యంగానైనా నైరుతి రుతుపవనాలు రావడంతో తెలుగు రాష్ట్రాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పొలం రెడీ చేసుకున్న రైతులు.. విత్తనాలు విత్తేందుకు సిద్ధం అవుతున్నారు.
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు మంగళవారం ప్రవేశించిన సంగతి తెలిసిందే. జోగులాంబ గద్వాల జిల్లా ద్వారా నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. నైరుతి రాకతో రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భీకరమైన ఎండలు, ఉక్కపోత, వేడితో అల్లాడిపోతున్న ప్రజలను.. చిరు జల్లులు పలకరిస్తున్నాయి. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో మొదలైన వర్షాల కారణంగా వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించారు.