బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..

Updated on: Jan 01, 2026 | 5:13 PM

కాన్పూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఘోర నిర్లక్ష్యం వెలుగుచూసింది. వైద్యులు బతికున్న 42 ఏళ్ల వినోద్‌ను మరణించినట్లు ప్రకటించి, పోస్టుమార్టం కోసం తరలించబోగా, చివరి నిమిషంలో అతను కదలడంతో పోలీసులు షాక్ అయ్యారు. మరణించిన వ్యక్తి ఫైల్‌కు బదులు బతికున్న వినోద్ ఫైల్‌పై సంతకం చేసిన జూనియర్ డాక్టర్ నిర్లక్ష్యం ఇది. ముగ్గురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు, విచారణకు కమిటీ ఏర్పాటైంది.

కాన్పూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఒకే వార్డులో పక్కపక్క బెడ్లపై ఉన్న ఇద్దరు రోగుల విషయంలో వైద్యులు ఘోర పొరపాటు చేసారు. ఒక నిండు ప్రాణాన్ని పోస్టుమార్టం టేబుల్ వరకు తీసుకెళ్లారు. బతికున్న వ్యక్తికి కాసేపట్లోనే వైద్యులు పోస్టుమార్టం చేయబోతున్నారనగా.. అతడిలో కదలిక చూసి షాక్ అయ్యారు. వార్డులో 42 ఏళ్ల వినోద్ అనే వ్యక్తి 42వ నంబర్ బెడ్‌పై, పేరు తెలియని మరో 60 ఏళ్ల వృద్ధుడు 43వ నంబర్ బెడ్‌పై చికిత్స తీసుకుంటున్నారు. వీరిద్దరూ నిస్సహాయ స్థితిలో ఆసుపత్రిలో చేరారు. అయితే 43వ నంబర్ బెడ్‌పై ఉన్న వృద్ధుడు చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడే అసలు సమస్య మొదలైంది. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ మరణించిన వృద్ధుడి ఫైల్‌కు బదులుగా.. పక్కనే ప్రాణాలతో ఉన్న వినోద్ మెడికల్ ఫైల్‌లో మరణించినట్లు సంతకం చేశారు. వైద్యులు వినోద్‌ను చనిపోయినట్లు ప్రకటించడంతో.. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శవాల గదికి తరలించేందుకు పోలీసులు వార్డుకు చేరుకున్నారు. అయితే బెడ్‌పై ఉన్న వ్యక్తిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. వినోద్ ఊపిరి పీల్చుకుంటూ కదలడం చూసి పోలీసులు షాకయ్యారు. “ఇతడు చనిపోలేదు.. బతికే ఉన్నాడు” అని పోలీసులు గట్టిగా చెప్పడంతో వార్డులో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ దారుణ నిర్లక్ష్యంపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్ కాలా తీవ్రంగా స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్, ఒక నర్సు సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వినోద్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడికి చికిత్స కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరణించిన అపరిచిత వృద్ధుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులే కనీసం రోగి పల్స్ కూడా చూడకుండా మరణ ధృవీకరణ పత్రం ఇవ్వడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

రూ. 15 వేల లోపు స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు మాములుగా లేవు

Best FD Interest Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు

గుండెను కాపాడే ఈ సూపర్ ఫుడ్ గురించి తెలుసా

కొండలా ఉన్న పొట్ట సులువుగా కరిగిపోవాలంటే..