కూలీ దంపతుల షష్టిపూర్తి వేడుక! పచ్చని చెట్టే వేదిక.. తోటి కూలీలే బంధువులు
మహబూబాబాద్ జిల్లాలో ఓ నిరుపేద దంపతులు తమ షష్టిపూర్తి వేడుకను ఆర్భాటాలకు దూరంగా తోటి కూలీల మధ్య నిరాడంబరంగా జరుపుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే సోమయ్య, జయమ్మ దంపతులను సహచర కూలీలు పూలమాలలతో సన్మానించి వేడుక నిర్వహించారు. ఆత్మీయతే అసలైన సంపద అని చాటిచెప్పిన ఈ కార్యక్రమం స్థానికంగా ఆదర్శంగా నిలిచింది.
సాధారణంగా పెళ్లయినా, షష్టిపూర్తి వేడుకైనా వేలాది రూపాయలు ఖర్చు చేసి కల్యాణ మండపాల్లో, ఆర్భాటంగా చేసుకోవడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. కానీ, ఆదర్శానికి పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఓ నిరుపేద జంట. అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని కష్టసుఖాల్లో పాలుపంచుకొని వివాహ బంధానికి నిజమైన అర్ధాన్ని మరోసారి గుర్తుచేస్తూ ఎంతో ఆదర్శంగా తమతో కలిసి పనిచేసే తోటి కూలీల మధ్య నిరాడంబరంగా షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఈ వినూత్న వేడుక జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు వెళ్లే ఆకుతోట సోమయ్య, జయమ్మ దంపతులలో సోమయ్యకు 60 ఏళ్లు నిండాయి. దీంతో, తాము నిత్యం కష్టపడే పని ప్రదేశంలోనే వేడుక నిర్వహించాలని తోటి కూలీలు నిర్ణయించారు. నూతన వస్త్రాలు ధరించి పనికి వచ్చిన ఈ దంపతులను తోటి కూలీలంతా కలిసి పచ్చని చెట్ల నీడన కూర్చోబెట్టి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీక వేడుకకు పచ్చని చెట్లే కళ్యాణ మండపమయింది.. తోటి కూలీలే బంధుమిత్రులయ్యారు. ఈ సందర్భంగా దంపతులు తోటి కూలీలకు మిఠాయిలు తినిపించి ఆనందం పంచుకున్నారు. “పెద్ద పెద్ద హంగులకు పోకుండా, మాతో కలిసి చెమటోడ్చే తోటి కూలీల మధ్య ఈ వేడుక జరుపుకోవడం ఎంతో ఆత్మీయంగా, తృప్తిగా అనిపించింది” అని సోమయ్య, జయమ్మ దంపతులు మురిసిపోయారు. డబ్బు ఆర్భాటాల కంటే ఆత్మీయతే మిన్న అని నిరూపించిన ఈ వేడుక ప్రస్తుతం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం
ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు
త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
Save The Tigers 3: ‘పెళ్లి తెచ్చిన తంటాలు..’కడుపుబ్బా నవ్విస్తున్న సేవ్ ది టైగర్స్ 3 ట్రైలర్