17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా తీరంలో ఓర్కా తల్లి తిమింగలం ‘తాహ్లెక్వా’ తన పుట్టిన వెంటనే చనిపోయిన పిల్లను 17 రోజుల పాటు 1,600 కిలోమీటర్లకుపైగా మోసుకెళ్లిన ఘటన ప్రపంచాన్ని కదిలించింది. ఈ ప్రవర్తన నిజమైన మాతృవేదనకు నిదర్శనమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అరుదైన సదర్న్ రెసిడెంట్ ఓర్కా జాతి పరిరక్షణపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మనసు, మమకారం, భావోద్వేగం కేవలం మనుషులకే కాదు మూగజీవులకూ ఉంటాయని నిరూపించే మరో అరుదైన ఘటన ఇది. 2018లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సముద్ర తీరంలో ‘తాహ్లెక్వా’ అనే ఓర్కా జాతికి చెందిన తల్లి తిమింగలం ఒక పిల్లకి జన్మనిచ్చింది. అయితే పుట్టిన అర గంటలోనే ఆ పిల్ల తిమింగలం కన్నుమూసింది. కన్నప్రేమతో ఆ తల్లి తన చనిపోయిన పిల్లను వదిలిపెట్టలేకపోయింది. సముద్రంలో ఏకంగా 1,600 కిలోమీటర్లకు పైగా ఈదుతూ, 17 రోజుల పాటు తన ముక్కు, తల సహాయంతో పిల్ల కళేబరాన్ని నీటిపై తేలియాడేలా మోసుకెళ్లింది. మధ్యలో మృతదేహం నీటిలో మునిగిపోయినప్పుడల్లా మళ్లీ లోతుల్లోకి వెళ్లి పైకి తెచ్చేది. ఈ ఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులను కలచివేసింది .శాస్త్రవేత్తలు దీనిని ‘టూర్ ఆఫ్ గ్రీఫ్’గా అభివర్ణించారు. ఆ తల్లి తిమింగలం అలసిపోయినప్పుడు గుంపులోని తోటి తిమింగలాలు కూడా కొంతసేపు ఆ కళేబరాన్ని మోసి దానికి తోడుగా నిలిచాయని పరిశోధకులు వెల్లడించారు. మొదట దీన్ని సాధారణ ప్రవర్తనగా భావించిన శాస్త్రవేత్తలు, తాహ్లెక్వా తర్వాత కూడా ఇలాంటి ప్రవర్తనను ప్రదర్శించడంతో ఇది నిజమైన దుఃఖం, మాతృవేదనే అని అభిప్రాయపడ్డారు. కన్నతల్లి ఆవేదనకు అద్దం పట్టిన ఈ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను కదిలించింది. ఓర్కా జాతులలోనూ భావోద్వేగాలకు కారణమయ్యే హార్మోన్లు ఉంటాయని నిపుణులు తెలిపారు. వాతావరణ కాలుష్యం, ఆహార కొరత కారణంగా ఈ అరుదైన ‘సదర్న్ రెసిడెంట్’ ఓర్కా జాతి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో పడిందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం.. మిస్టరీ ఛేదించిన శాస్త్రవేత్తలు!
