దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?

Updated on: Apr 28, 2025 | 10:33 PM

అది మంగళగిరిలోని మార్కండేయ కళ్యాణ మండపం. అక్కడ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. బంధువులు, స్నేహితులు రాకతో కళ్యాణ మండపం సందడిగా మారింది. వచ్చిన బంధువులంతా వధూవరులను ఆశీర్వదించి, విందు ఆరగించి వెళుతున్నారు. మండపానికి దగ్గర్లో చదివింపులు రాసేవాళ్ళు తమ బిజీలో తామున్నారు. అయితే పెళ్లికి వచ్చిన వారిలో ఒకరి దృష్టి చదివింపులు రాస్తున్న వారిపై పడింది. పెళ్లికి వచ్చిన బంధువులంతా తమ శక్తికొద్దీ కష్టంగా నగదు కానుకలు ఇచ్చారు. కాసేపటికి బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో చదివింపులు రాసిన వారు ఎంత మొత్తం వచ్చిందో లెక్కకట్టారు.

దాదాపు 3 లక్షల రూపాయలు రావడంతో ఆ నగదును బ్యాగులో సర్దు పెట్టారు. అయితే పెళ్లికి పిలిస్తే వచ్చాడో లేక అక్కడ పని చేసేందుకు వచ్చాడో తెలియదు కానీ ఓ వ్యక్తి వీరినే గమనించాడు. అతను చూసి 3 లక్షల రూపాయలకు పైగా ఉన్న కాష్ బ్యాగ్ పట్టుకుపోయాడు. అయితే కాసేపటికే బ్యాగ్ పోయిన విషయం గ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా నేర చరిత్ర ఉన్న వ్యక్తే బ్యాగ్ తీసుకెళ్ళినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.