మంటల్లో కావేరి ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి కావేరి ట్రావెల్స్ బస్సు వెళుతోంది. ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా పొగలు రావడాన్ని గమనించారు డ్రైవర్. వెనుక టైర్ పేలి పొగలు రావడం చూసి అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపేసారు.
ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో.. వారు తమ లగేజీని తీసుకొని హుటాహుటిన బస్సుకు కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆ తరువాత బస్సుకు మంటలు అంటుకొని పూర్తిగా దగ్దమైంది. ఆ సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉండగా, మంటలు వ్యాపించకముందే వారంతా సురక్షితంగా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వారి గమ్య స్థానాలకు పంపించినట్లు కావేరీ బస్సు ట్రావెల్స్ యాజమాన్యం తెలిపింది. ఘటనా ప్రాంతానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైంది. బస్సులో పొగలు రావడాన్ని డ్రైవర్ గుర్తించి వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఏడాది ఏపీలో జరిగిన వరుస ప్రమాదాలు ప్రయాణికుల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి 26న మర్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగి 13 మంది సజీవదహనమయ్యారు. అలాగే, ఇవాళ మే 14న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ప్రైవేట్ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వరుస ఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, రహదారి భద్రతా నియమాల అమలుపై పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్ కావాలంటున్న స్టార్స్!
భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు