చదివింది పది.. చేసేది లింగ నిర్ధారణ
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమైనప్పటికీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరు అక్రమంగా ఈ దందాను కొనసాగిస్తున్నారు. పాత స్కానింగ్ మిషన్లతో గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తూ, ఆడశిశువు అని తేలితే అక్రమ గర్భస్రావాలకు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిన ఈ నెట్‌వర్క్ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
కడుపులో ఉన్నది ఆడపిల్లో, మగపిల్లాడో తేల్చే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని నెత్తీనోరూ బాదుకుంటున్నా.. కొందరు కాసుల కక్కుర్తి కోసం ఈ ఘాతుకాలకు ఒడిగడుతూనే ఉన్నారు. విస్తుపోయే విషయమేంటంటే.. ఈ దందా నడుపుతున్న నిర్వాహకులు చదివింది కేవలం పదో తరగతి లేదా అంతకంటే తక్కువే! గతంలో స్కానింగ్ సెంటర్లలో పనిచేసిన అనుభవంతో పాత మిషన్లను కొనుగోలు చేసి ఈ ముఠాలు అక్రమ వ్యాపారానికి తెరలేపాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక వరకు విస్తరించింది. ఆర్ఎంపీలు, ల్యాబ్ నిర్వాహకులు, ఆటో డ్రైవర్ల ద్వారా గర్భిణులను రప్పిస్తున్నారు. చిత్తూరు భరత్‌నగర్‌లో గతంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒకేచోట 11 మంది పరీక్షలకోసం వచ్చిన గర్భిణులు దొరకడం ఈ నెట్‌వర్క్ తీవ్రతకు అద్దం పడుతోంది. లింగ నిర్ధారణ పరీక్ష కోసం ఒక్కొక్కరి నుండి రూ. 8 వేల నుండి రూ. 10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే.. వైద్య శిబిరం తరహాలో వారం లేదా 15 రోజులకోసారి నిర్వహిస్తున్నారు. నిపుణులైన వైద్యుల ప్రమేయం లేకుండానే అబార్షన్ కిట్లు ఇచ్చి గర్భస్రావాలు చేయిస్తున్నారు. ఈ గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 20 వేల నుండి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నకిలీల చేతిలో పడి తరచూ గర్భిణుల ప్రాణాలు సైతం ప్రమాదంలో పడుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మేమంతా చనిపోతున్నాం..’ అదే ఆ కుటుంబానికి ఆఖరి కాల్..
TTD: రికార్డ్ స్థాయిలో తిరుమల లడ్డూ విక్రయాలు.. ఒక్క మే నెలలోనే..
40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్
