బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
బరువు తగ్గేందుకు కేవలం డైటింగ్ లేదా వ్యాయామంపై మాత్రమే ఆధారపడటం సరిపోదని హైదరాబాద్‌లోని ICMR-NIN సమీక్షా పరిశోధన సూచిస్తోంది. 50కిపైగా దేశాల్లో 5 లక్షల మందికి పైగా పాల్గొన్న 112 పరిశోధనలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు, ఆహార నియంత్రణతో పాటు క్రమం తప్పని వ్యాయామం పాటించడం దీర్ఘకాలిక ఫలితాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. క్రాష్ డైటింగ్ కంటే సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, జీవనశైలి మార్పులే స్థిరమైన బరువు నిర్వహణకు కీలకమని తెలిపారు.
ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో ఊబకాయం పెను ప్రమాదకరంగా మారుతోంది.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా.. చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారని.. ఇదే అన్ని జబ్బులకు మూల కారణమని పలు వైద్య అధ్యయనాలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఊబకాయం.. బరువు తగ్గడంపై లాంటి సమస్యలపై హైదరాబాదులోని ప్రతిష్టాత్మక ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిర్వహించిన తాజా సమీక్షా పరిశోధనలో కొన్ని సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయి.. అవేంటో ఈ వీడియోలో సుధీర్ఘంగా తెలుసుకుందాం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి శరీర బరువు, ఎత్తు మధ్య సమతుల్యత చాలా ముఖ్యం.బరువు అవసరమైన దాని కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే.. రోగాల ముప్పు పొంచి ఉన్నట్లే. బాడీ మాస్ ఇండెక్స్ అనే రూల్ సాయంతో మన శరీర బరువు ఎంత ఉండాలనేది మనం తెలుసుకోవచ్చు. BMI 18.5 నుంచి 24.9 మధ్య ఉంటే, అది ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. 18.5 కంటే తక్కువ BMI అంటే మీరు తక్కువ బరువు కలిగి ఉన్నారని, 25 కంటే ఎక్కువ BMI ఊబకాయం లేదా అధిక బరువు అన్నట్లు. పెరుగుతున్న బరువు, దానికి తోడు చుట్టుముట్టే అనారోగ్య సమస్యలు.. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. అయితే, బరువు తగ్గడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి..? కేవలం డైటింగ్ చేస్తే సరిపోతుందా? లేక జిమ్‌లో చెమటోడ్చాలా? అనే సందేహాలకు ప్రముఖ పరిశోధనా సంస్థ ICMR-NIN పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో దాదాపు 5 లక్షల మందికి పైగా పాల్గొన్న 112 అంతర్జాతీయ పరిశోధనలను సుదీర్ఘంగా విశ్లేషించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు బరువు తగ్గడంపై సంచలన విషయాలను వెల్లడించింది NIN.. ICMR-NIN శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, బరువు తగ్గాలనుకునేవారు కేవలం డైటింగ్ లేదా కేవలం వ్యాయామంపై మాత్రమే ఆధారపడకూడదు. ఆహార నియంత్రణ, వ్యాయామం రెండింటినీ కలిపి పాటించినప్పుడే లాంగ్ టర్మ్ ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేశారు. 12 నెలల కంటే ఎక్కువ టైమ్ ఈ రెండింటినీ పాటించిన వారిలో సగటున 3.68 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. పరిశోధనలో తేలిన మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోవడం వల్ల మొదటి 3 నెలల వ్యవధిలోనే బరువు వేగంగా తగ్గుతారు. అయితే, కాలక్రమేణా కేవలం డైటింగ్ వల్ల మాత్రమే బరువు తగ్గడం సాధ్యపడదు. ఇక్కడే వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ప్రారంభంలో బరువు తగ్గే వేగం తక్కువగా ఉన్నప్పటికీ, రోజులు గడిచేకొద్దీ అది శరీరంలో స్థిరమైన మార్పులను తీసుకువస్తుంది. బరువు తగ్గడం ఎంత కష్టమో.. తగ్గించుకున్న బరువును అలాగే నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద సవాలు అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ ఈ పరిశోధనలో ఏం తేలింది అంటే.. కఠినమైన డైటింగ్ అంటే.. పస్తులు ఉండటం లేదా కేలరీలు బాగా తగ్గించడం ద్వారా మాత్రమే బరువు తగ్గిన వారిలో 80% కంటే ఎక్కువ మంది కొద్ది నెలల్లోనే మళ్లీ బరువు పెరుగుతున్నారని.. అధ్యయనం తెలిపింది.. సరైన పోషకాహారంతో పాటు క్రమం తప్పని వ్యాయామం శారీరక దినచర్యలో భాగం చేసుకున్నవారు మాత్రమే తగ్గిన బరువును సుదీర్ఘకాలం పాటు మెయింటెన్ చేయగలుగుతున్నారని NIN శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మనం కేలరీలను బాగా తగ్గించినప్పుడు శరీరం ‘సర్వైవల్ మోడ్’లోకి వెళ్తుంది. దీనివల్ల జీవక్రియ రేటు (Metabolic Rate) తగ్గుతుంది. బరువు తగ్గిన తర్వాత కూడా వ్యాయామం చేయడం వల్ల మాత్రమే ఈ మెటబాలిజం మందగించకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ జీవనశైలి మార్పులు కేవలం బరువు తగ్గడానికే కాకుండా బీపీ, షుగర్ వంటి వ్యాధులను అదుపు చేయడంలోనూ అద్భుతంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారిలో డయాస్టోలిక్ బీపీ అదుపులోకి వస్తుందని గుర్తించారు. డైట్, వ్యాయామం క్రమం తప్పకుండా పాటిస్తే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు తగ్గడమే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెరుగుపడుతుంది. బరువు తగ్గడం అంటే కేవలం.. త్రాసు మీద సంఖ్యను తగ్గించుకోవడం మాత్రమే కాదు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, జీవనశైలి మార్పులు కలిసినప్పుడే శరీరంలో సరైన మెటబాలిక్ మార్పులు వచ్చి గుండె సంబంధిత రోగాల ముప్పు తగ్గుతుంది అని ICMR-NIN డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి తెలిపారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు కేవలం ఒకే పద్ధతికి పరిమితం కాకుండా, సమతుల్య ఆహారంతో పాటు రోజువారీ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడమే ఉత్తమమైన మార్గమన్నారు.. అంతేకాకుండా.. స్థూలకాయ నిర్వహణకు సమగ్ర విధానం అవసరమని ఈ పరిశోధన ఫలితాలు బలపరుస్తున్నాయని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డైరెక్టర్ భారతి కులకర్ణి వివరించారు. “వేగంగా బరువు తగ్గడం” కంటే “ఆరోగ్యకరంగా బరువును నిలబెట్టుకోవడం” అత్యంత కీలకమైనదని NIN నివేదిక స్పష్టం చేస్తోంది. కాబట్టి క్రాష్ డైటింగ్‌ల జోలికి వెళ్లకుండా సమతుల ఆహారం, రోజూ వ్యాయామాన్ని మీ జీవితంలో భాగంగా చేసుకోవడమే దీనికి అసలైన పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!
వైభవ్ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా? పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ చురకలు
వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు!
