అసెంబ్లీని షేక్ చేసిన ‘స్నేక్’.. బడ్జెట్ వేళ మీడియా పాయింట్‌లో పాము హల్‌చల్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మధ్య ఊహించని విధంగా ఓ పాము మీడియా పాయింట్ వద్ద కలకలం సృష్టించింది. రాజకీయ వేడి రాజుకున్న సమయంలో ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ సాహసంతో పామును పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటనపై నెటిజన్లు, మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సాధారణంగానే అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తుతుంటాయి. మార్చి 20 శుక్రవారం కూడా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే హడావుడి, బయట ఆరు గ్యారంటీలపై విపక్షాల నిరసనలతో వాతావరణం వేడెక్కి ఉంది. అయితే, అందరూ రాజకీయ సెగలతో బిజీగా ఉన్న సమయంలో.. ఊహించని విధంగా ఒక ‘అతిథి’ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ హడలెత్తించింది. సరిగ్గా మీడియా పాయింట్ వద్ద నేతలు మాట్లాడుతున్న సమయంలో ఒక పాము వేగంగా దూసుకొచ్చింది. నేరుగా మీడియా పాయింట్ లోపలికి వెళ్లి బుసలు కొట్టడంతో అక్కడున్న జర్నలిస్టులు, పోలీసులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేలకు తమ సమస్యలు చెప్పుకోవడానికి జనం రావడం చూశాం కానీ, ఇలా పాము రావడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. కొందరు భయంతో పరుగులు తీయగా, మరికొందరు ఆ దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. అక్కడ గందరగోళం నెలకొన్న సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఏమాత్రం తడబడకుండా పామును నేరుగా తన చేతులతో పట్టుకుని బంధించారు. అనంతరం దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై అక్కడున్న వారు రకరకాలుగా చర్చించుకున్నారు. ప్రతిరోజూ నేతలు తమ గళంతో అసెంబ్లీని షేక్ చేస్తే.. ఈరోజు మాత్రం ‘స్నేక్’ వచ్చి షేక్ చేసింది అంటూ సరదాగా చర్చించుకున్నారు. బహుశా ఆ పాము కూడా తన సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించుకోవడానికి వచ్చిందేమోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే
ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం: అమ్మవారి మహిమంటూ భక్తుల పూజలు
అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..
ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో